1 సమూయేలు 17:1-58
1 సమూయేలు 17:1-58 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫిలిష్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోలో సమకూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకో, అజేకా మధ్య మకాం చేశారు. సౌలు, ఇశ్రాయేలీయులు కూడుకుని ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులను ఎదిరించడానికి వరుసల్లో నిలబడ్డారు. ఒక లోయకు ఇరుప్రక్కలా కొండల మీద ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులు నిలిచి ఉన్నారు. ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతడు గాతు ప్రాంతానికి చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు. అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు. అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి. అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు. అతడు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యం వారితో “నేను ఫిలిష్తీయుణ్ణి, మీరంతా సౌలు దాసులు కదా. యుద్ధం చేయడానికి మీరంతా ఎందుకు వస్తున్నారు? మీరు మీ తరఫున ఒకరిని ఎన్నుకుని అతణ్ణి నాపైకి యుద్ధానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలిగితే మేమంతా మీకు దాసోహం అవుతాం. నేనే గనక అతణ్ణి జయించి, అతణ్ణి చంపితే మీరంతా మాకు దాస్యం చేయాలి.” ఆ ఫిలిష్తీయుడు ఇంకా ఇలా అన్నాడు. “ఈ రోజున నేను ఇశ్రాయేలీయుల సైన్న్యాన్ని సవాలు చేస్తున్నాను. మీ నుండి ఒకరిని పంపితే వాడూ నేనూ పోరాడతాం” అంటూ రంకెలు వేశాడు. సౌలు, ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని కేకలు విని హడలిపోయి చాలా భయపడి పోయారు. దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు. యెష్షయి ముగ్గురు పెద్ద కొడుకులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధానికి వెళ్ళిన అతని ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు ఆఖరి కొడుకు. అన్నలు ముగ్గురూ సౌలుతోబాటు వెళ్లారు కాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుతూ, సౌలు దగ్గరకు వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుడు నలభై రోజులు ప్రతి ఉదయం సాయంత్రం లోయలోకి వచ్చి నిలబడేవాడు. యెష్షయి తన కొడుకు దావీదును పిలిచి “ఒక తూముడు వేయించిన గోదుమలనూ పది రొట్టెలనూ తీసుకు సైన్యంలో ఉన్న నీ అన్నల కోసం తొందరగా వెళ్ళు. ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా” అని చెప్పి పంపించాడు. సౌలు సైన్యం, ఇశ్రాయేలీయులంతా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. దావీదు ఉదయాన్నే లేచి మరో కాపరికి తన గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకు యెష్షయి ఆజ్ఞాపించినట్టు ప్రయాణమయ్యాడు. అతడు యుద్ధ శిబిరం చేరే సమయానికి సైన్యాలు బారులుతీరి నినాదాలు చేస్తూ యుద్ధరంగానికి చేరుకొంటున్నారు. ఇశ్రాయేలువారు, ఫిలిష్తీయవారు ఎదురెదురుగా నిలిచి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామానులు భద్రపరచే వాని దగ్గర ఉంచి, పరిగెత్తుకుంటూ సైన్యంలో చొరబడి తన అన్నలను కుశల ప్రశ్నలడిగాడు. అతడు వారితో మాట్లాడుతున్నప్పుడు గాతు పట్టణపు ఫిలిష్తీయ బలశాలి, గొల్యాతు ఫిలిష్తీయుల సైన్యంలోనుండి వచ్చి పైన పలికిన మాటల్నే చెప్పడం దావీదు విన్నాడు. ఇశ్రాయేలీ సైనికులు అతణ్ణి చూసి ఎంతో భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు. ఇశ్రాయేలీయులు “ముందుకు వస్తున్న అతణ్ణి చూశారా, కచ్చితంగా ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి వాడు బయలుదేరాడు. వాణ్ణి చంపినవాడికి రాజు చాలా డబ్బులిచ్చి, కూతురినిచ్చి పెళ్లిచేసి, అతణ్ణి, అతని కుటుంబాన్ని పన్ను కట్టే బాధ్యత నుండి మినహాయిస్తాడు” అని చెప్పాడు. అప్పుడు దావీదు “సజీవుడైన దేవుని సైన్యాలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయునికి ఎంత ధైర్యం?” వాణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు వచ్చిన ఈ అపవాదును తీసివేసిన వాడికి వచ్చే బహుమతి ఏమిటి అని తన దగ్గర నిలబడినవాళ్ళని అడిగితే, వారు, వాణ్ణి చంపినవాడికి లభించే కానుకల గురించి చెప్పారు. దావీదు వారితో మాట్లాడుతున్న విషయాలు, అతని పెద్దన్న ఏలీయాబు విన్నాడు. అతడు దావీదు మీద కోపపడి “నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీ గర్వం, నీలోని చెడుతనం నాకు తెలుసు. యుద్ధం చూడడానికే నువ్వు వచ్చావు కదా?” అన్నాడు. దావీదు “నేనేం చేశాను? ఊరికే అడుగుతున్నాను” అని చెప్పి అక్కడ నుండి మరో వ్యక్తిని ఆలానే అడిగాడు. మళ్ళీ అదే జవాబు వచ్చింది. దావీదు అడుగుతున్న మాటలు కొందరికి తెలిసినప్పుడు వారు ఆ సంగతి సౌలుతో చెబితే సౌలు దావీదును పిలిపించాడు. దావీదు సౌలుతో “ఈ ఫిలిష్తీయుడి విషయంలో ఎవరూ ఆందోళన పడనక్కరలేదు. మీ సేవకుడనైన నేను వాడితో యుద్ధం చేస్తాను” అన్నాడు. సౌలు “ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేయడానికి నీకు బలం చాలదు. నువ్వు చిన్న పిల్లవాడివి. వాడు చిన్నప్పటినుండి యుద్దాలు చేస్తూ ఉన్నాడు” అని దావీదుతో అన్నాడు. అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు. సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు. అప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రాలను దావీదుకు తొడిగించాడు. ఒక కంచు శిరస్త్రాణం అతనికి పెట్టి, యుద్ధ కవచం తొడిగించాడు. దావీదు తన యుద్ధ కవచం మీద తన కత్తి కట్టుకున్నాడు. అయితే అవి అతనికి అలవాటు లేవు గనక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు “ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను యుద్ధానికి వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. తన చేతికర్ర పట్టుకుని వాగులోనుండి ఐదు నున్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయునికి దగ్గరగా వెళ్ళాడు. బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ తేరి చూసి, ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు. ఫిలిష్తీయుడు “కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు. “నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు, జంతువులకు వేస్తాను” అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు, దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను. అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు. ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు. దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలువారు, యూదావారు లేచి, హర్షధ్వానాలు చేస్తూ బయలుదేరి లోయ ప్రదేశం వరకూ, ఎక్రోను ద్వారాల వరకూ ఫిలిష్తీయులను తరిమారు. చచ్చిన ఫిలిష్తీయులు షరాయిం దారి పొడవునా గాతు, ఎక్రోను పట్టణాల వరకూ కూలిపోయారు. తరువాత ఇశ్రాయేలువారు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగి వచ్చి వారి డేరాల్లో ఉన్నదంతా దోచుకున్నారు. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధాలను తన డేరాలో ఉంచుకుని, అతని తలను తీసుకు యెరూషలేముకు వచ్చాడు. దావీదు ఫిలిష్తీయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళడం చూసి సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి “అబ్నేరూ, ఈ కుర్రవాడు ఎవరి కొడుకు?” అని అడిగినప్పుడు, అబ్నేరు “రాజా, నీమీద ఒట్టు. అతడెవరో నాకు తెలియదు” అన్నాడు. అప్పుడు రాజు “ఈ కుర్రవాడు ఎవరి కొడుకో అడిగి తెలుసుకో” అని ఆజ్ఞాపించాడు. ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్న దావీదును అబ్నేరు ఎదుర్కొని ఫిలిష్తీయుని తల, దావీదు చేతిలో ఉండగానే సౌలు దగ్గరికి తీసుకువచ్చాడు. సౌలు అతనితో “అబ్బాయ్! మీ నాన్న ఎవరు?” అని అడిగినప్పుడు దావీదు “నేను నీ దాసుడు, బేత్లెహేము ఊరి వాడైన యెష్షయి కొడుకుని” అని జవాబిచ్చాడు.
1 సమూయేలు 17:1-58 పవిత్ర బైబిల్ (TERV)
ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది. సౌలు, మరియు ఇశ్రాయేలు సైన్యాలుకూడా సమావేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. ఫిలిష్తీయులతో యుద్ధానికి సౌలు సైన్యం తయారయ్యింది. ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది. ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు. అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది. గొల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది. గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు.” గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు. గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి. వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను. “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు. గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు. ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు దావీదు, యూదాలో ఉన్న బేత్లెహేముకు చెందినవాడు యెష్షయి. అతనికి ఎనమండుగురు కుమారులు. సౌలు కాలంలో యెష్షయి వృద్ధుడు. యెష్షయి. యొక్క ముగ్గురు పెద్ద కుమారులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమారుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా. దావీదు అందరికంటె చిన్న కుమారుడు. పెద్ద కుమారులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు. కానీ దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెలను కాసేందుకు అప్పుడప్పుడూ సౌలును వదిలి వెళ్లేవాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రాయేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు. ఒక రోజు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా చెప్పాడు: “యుద్ధాల శిబిరంలో ఉన్న నీ అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలు తీసుకుని వెళ్లు. ఈ పది జున్ను ముక్కలు కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మందిగల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా వున్నారో తెలుసుకొని, వారి యోగక్షేమాలకు గుర్తుగా ఏదైనా తిరిగి తీసుకునిరా. నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.” దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు. ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు. ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు. దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు. గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము. ఇశ్రాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు: “వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్కలంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు ధనవంతుడైపోతాడు; గొల్యాతును చంపినవానికి సౌలు తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్ఛగా ఉండనిస్తాడు.” తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు అడిగాడు, “ఈ ఫిలిష్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలిష్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటున్నాడు?” కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు. దావీదు సైనికులతో మాట్లాడుతుండగా అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. దావీదు మీద ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొర్రెలను అరణ్యంలో ఎవరి దగ్గర వదిలి పెట్టావు? నాకు తెలుసు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది, చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు దావీదును నిలదీసాడు. “ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయలేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు దావీదు. దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే ప్రశ్నలు వేశాడు. వారు కూడ ఇంతకు ముందు చెప్పిన సమాధానలే దావీదుకు చెప్పారు. దావీదు పలికినది అంతా కొందరు సౌలుతో చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు. దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు. సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు. అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే, దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని. నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు. యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు. “అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు. సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు. దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు. అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు. దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే. గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు. “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది. ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు. దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు. అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దావీదు చేతిలో కనీసం కత్తికూడ లేదు. కనుక దావీదు పరుగున పోయి పడివున్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుని హతమార్చాడు. ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిష్తీయులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు. ఇశ్రాయేలు, యూదా సైనికులు జయజయధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు తరిమి తరమి కొట్టారు. చాలామంది ఫిలిష్తీయులను వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపై గాతు, ఎక్రోనుల వరకు అంత దూరమూ పడివున్నాయి. ఫిలిష్తీయుల సైన్యాన్ని వెళ్లగొట్టి వచ్చి, ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి చాలా వస్తు సంపదను తీసుకున్నారు. గొల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసుకుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను కూడా దావీదు తన గుడారములో పెట్టాడు. దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు. “మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు. సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు. గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు. “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు. “బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.
1 సమూయేలు 17:1-58 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకునుమధ్యను దిగి యుండగా సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయులమధ్యను ఒక లోయయుండెను. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి. అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజములమధ్యను రాగి బల్లెమొకటి యుండెను. అతని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి–యుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి; అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి–నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను. అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు –వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో–నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. అందుకు దావీదు–నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. –ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తములేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు–ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. –నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందునవాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి–జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి–అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు–రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను. అందుకు రాజు–ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. సౌలు అతనిని చూచి–చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు–నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.
1 సమూయేలు 17:1-58 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఫిలిష్తీయులు తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చి యూదాలోని శోకోలో సమీకరించి ఎఫెస్-దమ్మీము దగ్గర శోకోకు అజేకాకు మధ్యన శిబిరం ఏర్పరచుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులు కలిసివచ్చి ఏలహు లోయలో శిబిరం ఏర్పరచుకొని ఫిలిష్తీయులకు ఎదురుగా పోరాడడానికి యుద్ధవరుసలు ఏర్పరచుకున్నారు. ఫిలిష్తీయులు ఒక కొండను, ఇశ్రాయేలీయులు మరొక కొండను ఆక్రమించుకున్నారు, వాటి మధ్య లోయ ఉంది. గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన. అతని తలమీద ఇత్తడి శిరస్త్రాణం ఉంది, అతడు 5,000 షెకెళ్ళ బరువుగల ఇత్తడి యుద్ధకవచాన్ని ధరించాడు. అతని కాళ్లకు ఇత్తడి తొడుగు అతని వీపు మీద ఒక ఇత్తడి బల్లెం ఉన్నాయి. అతని ఈటె నేతపనివాని కర్రంత పెద్దది. అతని ఈటె కొనలో ఉన్న ఇనుము బరువు ఆరువందల షెకెళ్ళు. అతని డాలు మోసేవాడు అతని ముందు నడుస్తున్నాడు. గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి. అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు. ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు. ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు. దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు. యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు. అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు. అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా. వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు. దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లు భద్రపరిచేవానికి అప్పగించి పరుగెత్తి వెళ్లి యుద్ధభూమిలో ఉన్న తన అన్నలను వారి క్షేమం అడిగాడు. అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు. ఇశ్రాయేలీయులందరు అతన్ని చూసి చాలా భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు. ఇశ్రాయేలీయులలో ఒకడు, “వస్తున్న ఆ వ్యక్తిని చూశారా, ఇశ్రాయేలీయులను ఎదిరించడానికే అతడు వస్తున్నాడు. అయితే అతన్ని చంపినవాన్ని రాజు గొప్ప ధనవంతునిగా చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి అతని కుటుంబం ఇశ్రాయేలులో పన్నులు కట్టే అవసరం లేకుండ చేస్తారు” అని చెప్పాడు. అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు. అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు. దావీదు వారితో మాట్లాడిన మాటలు అతని పెద్దన్న ఏలీయాబు విని దావీదు మీద కోప్పడి అతనితో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు. అందుకు దావీదు, “నేనేమి చేశాను? నేనేమి మాట్లాడకూడదా?” అని అడిగి, అతని దగ్గర నుండి వెళ్లి మరొకరిని మరలా అదే ప్రశ్న అడిగాడు. వారు కూడా అదే జవాబిచ్చారు. దావీదు మాటలు విన్న మరికొందరు వాటిని సౌలుకు చెప్పినప్పుడు అతడు దావీదును పిలిపించాడు. దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు. అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు. అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే, నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు. దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు. అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు. సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు. దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు. అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు. తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి, ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు. అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు. అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు. ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు. దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు. అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు. అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంటాడడం ఆపి, తిరిగివచ్చి వారి డేరాలను దోచుకున్నారు. దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు. దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు. అందుకు రాజు, “ఈ యువకుడు ఎవరి కుమారుడో తెలుసుకోండి” అని ఆజ్ఞాపించాడు. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు. సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు. అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.