1 పేతురు 1:3-25

1 పేతురు 1:3-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు. ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మనకొరకు భద్రపరిచారు. మీరు యుగాంతంలో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కొరకు భద్రపరచబడి ఉంది. మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి, వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. అవి మీ విశ్వాసం యదార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం కూడ అగ్ని చేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటె ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి, అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది, దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. మీరు ఆయనను చూడకపోయినా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు. మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా మరియు చాలా జాగ్రత్తగా శోధించారు, క్రీస్తు అనుభవించవలసిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను లేక ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోడానికి ప్రయత్నించారు. పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కొరకు కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేసారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు. కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. మీరు విధేయత కలిగిన బిడ్డలు కనుక, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ఉండకండి. మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, గనుక మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. వ్రాయబడిన ప్రకారం: “నేను పరిశుద్ధుడను, గనుక మీరూ పరిశుద్ధంగా ఉండాలి.” పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పుతీర్చే దేవుణ్ణి మీరు తండ్రీ అని పిలుస్తున్నారు, కాబట్టి ఈ లోకంలో పరదేశులుగా మీకు మిగిలి వున్న జీవితకాలాన్ని ఆయనలో భయభక్తులతో గడపండి. ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన ఉపయోగం లేని జీవితం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. అయితే నిష్కళంకమైన లేదా లోపం లేని గొర్రెపిల్ల, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కొరకు ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు. మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి. ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు, తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగివుండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి. ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. ఎందుకనగా, “మానవులందరు గడ్డి వంటివారు, వారి వైభవం గడ్డి పువ్వు వంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి, కాని దేవుని వాక్యం నిరంతరం నిలుచును.” ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.

షేర్ చేయి
Read 1 పేతురు 1

1 పేతురు 1:3-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది. దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు. మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి. విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది. ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.

షేర్ చేయి
Read 1 పేతురు 1

1 పేతురు 1:3-25 పవిత్ర బైబిల్ (TERV)

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు. చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది. మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది. ఈ రక్షణ విషయంలో, ప్రవక్తలు మీకోసం రాబోవు కృపను గురించి మాట్లాడుతూ అతిజాగ్రత్తతో తీవ్రంగా పరిశోధించారు. వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధల్ని గురించి, ఆ తర్వాత ఆయన పొందనున్న మహిమను గురించి వాళ్ళకు ముందుగానే తెలియజేసాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసారు. తమ లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా చేసారు. ఈ విషయం దేవుడు వాళ్ళకు తెలియచేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు. అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి. మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి” అని వ్రాయబడిఉంది. పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తారు కనుక మీరు భయభక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి. ఎందుకంటే, మీ పూర్వికులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు. ఏ లోపమూ, మచ్చాలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేసాడు. ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి. సత్యాన్ని విధేయతతో ఆచరించటంవల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. నశించిపోయే సంతానంగా మీరు తిరిగి పుట్టలేదు, గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. ఎందుకంటే, “మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు. వాళ్ళ కీర్తి గడ్డి పువ్వులాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది, కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.”

షేర్ చేయి
Read 1 పేతురు 1

1 పేతురు 1:3-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు. ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మన కోసం భద్రపరిచారు. చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది. మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం అగ్నిచేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి. అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది. దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు. మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా చాలా జాగ్రత్తగా విచారించి పరిశోధించారు. క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కోసం కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు. కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. మీరు విధేయత కలిగిన బిడ్డలు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ప్రవర్తించకండి. మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి” అని వ్రాయబడి ఉంది. పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు. మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి. ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి. ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. ఎందుకనగా, “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి వైభవం అంతా పొలంలోని పువ్వు వంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి, కాని దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.” ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.

షేర్ చేయి
Read 1 పేతురు 1

1 పేతురు 1:3-25

1 పేతురు 1:3-25 TELUBSI1 పేతురు 1:3-25 TELUBSI1 పేతురు 1:3-25 TELUBSI1 పేతురు 1:3-25 TELUBSI