1 రాజులు 5:1-7

1 రాజులు 5:1-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు. సొలొమోను హీరాముకు ఇలా సందేశం పంపాడు: “యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు. అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు. కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను. “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.” హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.

1 రాజులు 5:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు. “యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి. తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు. కాబట్టి ‘నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు’ అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను. లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా. మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను” అన్నాడు. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి “ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక” అన్నాడు.

1 రాజులు 5:1-7 పవిత్ర బైబిల్ (TERV)

హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు: “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు. కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగా వున్నారు. “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను. అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు సీదోను వడ్రంగులకు సాటిరారు.” సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు.

1 రాజులు 5:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. –యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచువరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయె నన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునులేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు. కాబట్టి–నీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి

1 రాజులు 5:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)