1 రాజులు 5:1-7

1 రాజులు 5:1-7 IRVTEL

తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు. “యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి. తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు. కాబట్టి ‘నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు’ అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను. లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా. మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను” అన్నాడు. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి “ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక” అన్నాడు.