1 రాజులు 3:1-15
1 రాజులు 3:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినములవరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నతస్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెనుగాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా సొలొమోను ఈలాగు మనవి చేసెను–నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి, యీ దినమున నున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనులమధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాలదేశమును తనికీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను–దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనినయెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందుచేయించెను.
1 రాజులు 3:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు. అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు. సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు. ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.” సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు. ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు. నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు. అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.
1 రాజులు 3:1-15 పవిత్ర బైబిల్ (TERV)
సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింపచేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు. దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు. యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పనిది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొనసాగించాడు. సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు. సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా అతనికి స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు. సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. అతను నిన్ననుసరించాడు. అతను కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవతని కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు అతనికి అపూర్వమైన కరుణ చూపావు. నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్కపెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము లేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.” సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు. పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.” సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.
1 రాజులు 3:1-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు. యెహోవా నామం కోసం అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు కాబట్టి ప్రజలు ఇంకా క్షేత్రాల దగ్గర బలులు అర్పించేవారు. సొలొమోను తన తండ్రియైన దావీదు హెచ్చరికల ప్రకారం జీవిస్తూ, యెహోవా పట్ల తన ప్రేమను కనుపరిచాడు. అయితే అతడు క్షేత్రాల మీద మాత్రం బలులు అర్పిస్తూ, ధూపం వేసేవాడు. కొండల్లో గిబియోను చాలా ప్రాముఖ్యమైన ఉన్నత స్థలం కాబట్టి రాజైన సొలొమోను బలులు అర్పించడానికి అక్కడికి వెళ్లి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు. గిబియోనులో రాత్రివేళ కలలో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు. సొలొమోను జవాబిస్తూ ఇలా అన్నాడు, “మీ దాసుడు, నా తండ్రియైన దావీదు మీ పట్ల నమ్మకంగా, నీతి నిజాయితీ కలిగి ఉండేవాడు కాబట్టి మీరు అతనిపై ఎంతో దయను చూపించారు. మీరు అదే గొప్ప కనికరాన్ని తన పట్ల కొనసాగిస్తూ, ఈ రోజు అతని సింహాసనం మీద అతనికి కుమారుని కూర్చోబెట్టారు. “ఇప్పుడు యెహోవా, నా దేవా! నా తండ్రియైన దావీదుకు బదులుగా మీరు మీ దాసుడనైన నన్ను రాజుగా నియమించారు. అయితే నేను చిన్న బాలున్ని, నా విధులు ఎలా నిర్వర్తించాలో నాకు తెలియదు. మీ దాసుడనైన నేను మీరు ఎన్నుకున్న మీ ప్రజలమధ్య ఉన్నాను, వారు గొప్ప ప్రజలు, లెక్కించలేనంత ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?” సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది. కాబట్టి దేవుడు అతనితో ఇలా అన్నారు, “నీవు నీకోసం దీర్ఘాయువును గాని, ధనాన్ని గాని, నీ శత్రువుల చావును గాని అడగకుండా న్యాయంగా పరిపాలించడానికి వివేచనను అడిగావు కాబట్టి, నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు. అంతేకాక నీవు అడగని ఐశ్వర్యాన్ని ఘనతను నీకిస్తాను. తద్వారా నీ జీవితకాలమంతా రాజులలో నీకు ఎవరూ సాటి ఉండరు. నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.” తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు. అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.