1 రాజులు 3:1-15

1 రాజులు 3:1-15 TELUBSI

తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినములవరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నతస్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెనుగాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై–నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా సొలొమోను ఈలాగు మనవి చేసెను–నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి, యీ దినమున నున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనులమధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాలదేశమును తనికీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను–దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములుగల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనినయెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందుచేయించెను.

Free Reading Plans and Devotionals related to 1 రాజులు 3:1-15