1 రాజులు 18:20-40

1 రాజులు 18:20-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు. ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు. అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను. తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు. అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు. వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు. మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు. వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు. ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు. అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు. “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు. ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు. తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు. సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు. అప్పుడు ఏలీయా “బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు” అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 18

1 రాజులు 18:20-40 పవిత్ర బైబిల్ (TERV)

పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు. ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు. ప్రజలు ఏమీ మాట్లాడలేదు. అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు. కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.” ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పుకున్నారు. బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.” కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు. మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా. అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు. మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు. అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది. సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.” అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.” అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 18

1 రాజులు 18:20-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అహాబు ఇశ్రాయేలువారందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి –యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపులమధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి. అప్పుడు ఏలీయా– యెహోవాకు ప్రవక్తలైనవారిలో నేను ఒకడనే శేషించియున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా జనులందరును–ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి. అప్పుడు ఏలీయా బయలు ప్రవక్తలను పిలిచి–మీరు అనేకులైయున్నారు గనుక మీరే మొదట ఒక యెద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరునుబట్టి ప్రార్థన చేయుడి; అయితే మీరు అగ్నియేమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన యెద్దును తీసికొని సిద్ధముచేసి, ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు–బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరునుబట్టి ప్రార్థనచేసిరిగాని యొక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులువేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నముకాగా ఏలీయా–వాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానముచేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసియున్నదేమో అని అపహాస్యముచేయగా వారు మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచు నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయమువరకు వారు ప్రకటనముచేయుచు వచ్చిరి గాని, మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యముచేసినవాడైనను లేక పోయెను. అప్పుడు ఏలీయా–నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యెహోవావాక్కు ప్రత్యక్షమై – నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠముకట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా–మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అదియైన తరువాత–రెండవ మారు ఆప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; –మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు ఆ నీళ్లు బలిపీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను – యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయులమధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరును దాని చూచి సాగిలపడి–యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి. అప్పుడు ఏలీయా–ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.

షేర్ చేయి
Read 1 రాజులు 18

1 రాజులు 18:20-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు. ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు. అప్పుడు ఏలీయా వారితో, “యెహోవా ప్రవక్తల్లో నేనొక్కడినే మిగిలాను, కాని బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది ఉన్నారు. మాకు రెండు ఎడ్లను తీసుకురండి, వారు ఆ ఎడ్లలో ఒకదాన్ని బయలు ప్రవక్తలు తీసుకుని దానిని ముక్కలుగా కోసి, క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేర్చాలి. ఇంకొక ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేరుస్తాను. మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు. అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు. ఏలీయా బయలు ప్రవక్తలతో, “మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేయండి. మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, అయితే నిప్పు అంటించకూడదు” అన్నాడు. కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్న సమయంలో ఏలీయా వారిని గేలి చేస్తూ, “బిగ్గరగా అరవండి! అతడు నిజంగా దేవుడే కదా! బహుశ అతడు ఏదైన ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడేమో, లేదా పనిలో ఉన్నాడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. బహుశ పడుకున్నాడేమో, అతన్ని నిద్ర లేపాలేమో” అన్నాడు. కాబట్టి వారు ఇంకా బిగ్గరగా కేకలువేస్తూ వారి అలవాటు ప్రకారం రక్తం ధారలుగా కారే వరకు కత్తులతో, ఈటెలతో తమను తాము కోసుకున్నారు. మధ్యాహ్నం దాటింది, సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. అయినా స్పందన లేదు, ఎవరు జవాబివ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఏలీయా ప్రజలందరితో, “ఇక్కడకు నా దగ్గరకు రండి” అన్నాడు. వారతని దగ్గరకు రాగా అతడు పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు. అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు. రాళ్లతో యెహోవా పేరున బలిపీఠం కట్టి, దాని చుట్టూ రెండు శేయల గింజలు పట్టేటంత పెద్దగా కందకం తవ్వాడు. అతడు బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచాడు. తర్వాత వారితో, “నాలుగు పెద్ద జాడీలు నీళ్లతో నింపి, అర్పణ మీద కట్టెల మీద పోయండి” అన్నాడు. అతడు, “మళ్ళీ అలాగే చేయండి” అని చెప్పగా వారు మళ్ళీ అలాగే చేశారు. అతడు, “మూడవసారి కూడా అలాగే చేయండి” అనగానే వారు మళ్ళీ దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద నీళ్లు పోశారు. నీళ్లు బలిపీఠం మీద నుండి చుట్టూ పారుతూ కందకం కూడా నిండిపోయింది. అర్పణ సమయంలో, ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరగా వెళ్లి ఇలా ప్రార్థించాడు: “యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలులో మీరే దేవుడని, నేను మీ సేవకుడినని, మీ ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశానని ఈ రోజు వెల్లడి చేయండి. యెహోవా, నాకు జవాబివ్వండి; మీరే దేవుడైన యెహోవా అని, మీరు వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వండి.” అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, మట్టిని దహించి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేలా చేసింది. ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి, “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అని అంటూ కేకలు వేశారు. అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తలను పట్టుకోండి! వారిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు, ఏలీయా వారిని కీషోను లోయలోకి తీసుకెళ్లి అక్కడ చంపాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 18