1 రాజులు 18:20-40

1 రాజులు 18:20-40 IRVTEL

అహాబు ఇశ్రాయేలు వారందరి దగ్గరికి వార్తాహరులను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వతం దగ్గరికి సమకూర్చాడు. ఏలీయా ప్రజలందరి దగ్గరికి వచ్చి “ఎంతకాలం మీరు రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించండి” అని చెప్పాడు. ప్రజలు అతనికి జవాబుగా ఒక మాట కూడా పలకలేదు. అప్పుడు ఏలీయా “యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడినే మిగిలాను. అయితే, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు రెండు ఎద్దులు ఇవ్వండి. వాళ్ళు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని ముక్కలు చేసి, కింద నిప్పు పెట్టకుండా కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, కింద నిప్పు పెట్టకుండా దాన్ని కట్టెల మీద పెడతాను. తరువాత మీరు మీ దేవుడు పేరును బట్టి ప్రార్థన చేయండి. నేను యెహోవా పేరును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలు కాల్చి జవాబిస్తాడో ఆయనే దేవుడు” అన్నాడు. ప్రజలంతా “ఆ మాట బాగుంది” అని జవాబిచ్చారు. అప్పుడు ఏలీయా, బయలు ప్రవక్తలను పిలిచి “మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును సిద్ధం చేసి మీ దేవుడి పేర ప్రార్థన చేయండి. అయితే కింద నిప్పు పెట్టొద్దు” అన్నాడు. వారు తమకిచ్చిన ఎద్దును తీసుకు సిద్ధం చేసి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ “బయలు దేవుడా, మా ప్రార్థన విను” అంటూ బయలు పేరున ప్రార్థన చేశారు గాని వారికి ఒక్క మాట కూడా జవాబిచ్చేవాడు ఎవడూ లేకపోయారు. వాళ్ళు తాము చేసిన బలిపీఠం దగ్గర చిందులు తొక్కడం మొదలు పెట్టారు. మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా “వాడు దేవుడు గదా! పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ పరధ్యానంలో ఉన్నాడేమో! మూత్రవిసర్జనకు వెళ్లాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో! ఒకవేళ నిద్రపోతుంటే లేపాలేమో” అని గేలి చేశాడు. వారింకా పెద్దగా కేకలేస్తూ రక్తం కారేంత వరకూ తమ అలవాటు ప్రకారం కత్తులతో బాణాలతో తమ దేహాలను కోసుకుంటున్నారు. ఈ విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్ర బలి అర్పణ సమయం వరకూ వారు కేకలు వేశారు గానీ వాళ్ళకి ఏ జవాబూ రాలేదు. ఏ దేవుడూ వారి కేకలను పట్టించుకోలేదు. అప్పుడు ఏలీయా “నా దగ్గరికి రండి” అని ప్రజలతో చెప్పాడు. వారంతా అతని దగ్గరికి వచ్చారు. అతడు పాడైపోయి ఉన్న యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేశాడు. “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందిన యాకోబు వంశపు గోత్రాల లెక్క ప్రకారం ఏలీయా పన్నెండు పెద్ద రాళ్లను తీసుకున్నాడు. ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు. తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు. సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు. అప్పుడు ఏలీయా “బయలు దేవుడి ప్రవక్తలందర్నీ పట్టుకోండి. ఎవర్నీ వదలొద్దు” అన్నాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు. ఏలీయా కీషోను వాగు దగ్గరికి వారిని తీసికెళ్ళి చంపేశాడు.