1 రాజులు 1:28-53

1 రాజులు 1:28-53 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దావీదు “బత్షెబను పిలవండి” అని ఆజ్ఞాపించాడు. ఆమె రాజు సన్నిధికి తిరిగి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు ప్రమాణ పూర్వకంగా “అన్ని రకాల సమస్యల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, ‘తప్పకుండా నీ కొడుకైన సొలొమోను నా తరవాత నాకు బదులుగా నా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలిస్తాడని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామం తోడు’ అని నేను నీకు మునుపు ప్రమాణం చేసిన దాన్ని ఈ రోజే నెరవేరుస్తాను” అని చెప్పాడు. అప్పుడు బత్షెబ సాష్టాంగపడి రాజుకు నమస్కారం చేసి “నా యజమాని, రాజు అయిన దావీదు చిరకాలం జీవిస్తాడు గాక” అంది. అప్పుడు రాజైన దావీదు “యాజకుడు సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ నా దగ్గరికి పిలవండి” అని ఆజ్ఞాపించాడు. వారు రాజు ఎదుటికి వచ్చారు. రాజు “మీరు మీ యజమానినైన నా సేవకులను తీసుకు వెళ్ళి నా కొడుకు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకు వెళ్ళండి. యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి’ అని ప్రకటన చేయాలి. తరువాత, ఇశ్రాయేలు వారి మీదా యూదా వారి మీదా నేను అతణ్ణి అధికారిగా నియమించాను. కాబట్టి మీరు యెరూషలేముకు అతని వెంట రావాలి. అతడు నా సింహాసనం మీద కూర్చుని నా స్థానంలో రాజవుతాడు” అని ఆజ్ఞాపించాడు. అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు ఈ విధంగా జవాబిచ్చాడు. “ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా ఆ మాటను స్థిరపరుస్తాడు గాక. యెహోవా నీకు తోడుగా ఉన్నట్టు సొలొమోనుకు కూడా తోడుగా ఉండి, నా యజమానివీ రాజువీ అయిన నీ రాజ్యం కంటే అతని రాజ్యాన్ని ఘనమైనదిగా చేస్తాడు గాక.” కాబట్టి యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను, యెహోయాదా కొడుకు బెనాయా, కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గిహోనుకు తీసుకు వచ్చారు. సాదోకు గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వారు బాకా ఊదగా ప్రజలంతా “రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి” అని కేకలు వేశారు. ప్రజలంతా అతని వెంట వచ్చి వేణువులు ఊదుతూ, వాటి స్వరం చేత నేల అదిరిపోయేటంతగా అమితంగా సంతోషించారు. అదోనీయా, అతనితో ఉన్న అతిథులూ విందు ముగిస్తూ ఉండగా ఆ కోలాహలం వారికి వినబడింది. యోవాబు ఆ బాకానాదం విని “పట్టణంలో ఈ సందడి ఏమిటి?” అని అడిగాడు. అంతలో, యాజకుడు అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా “లోపలికి రా, నీవు యోగ్యుడివి. మంచి వార్తతో వస్తావు” అన్నాడు. అప్పుడు యోనాతాను అదోనీయాతో “మన యజమాని, రాజు అయిన దావీదు సొలొమోనును రాజుగా నియమించాడు. రాజు యాజకుడైన సాదోకునూ ప్రవక్త నాతానునూ యెహోయాదా కొడుకు బెనాయానూ కెరేతీయులనూ పెలేతీయులనూ అతనితో పంపాడు. వారు రాజు కంచరగాడిద మీద అతనిని ఊరేగించారు. యాజకుడైన సాదోకూ ప్రవక్త నాతానూ గిహోనులో అతనికి పట్టాభిషేకం చేశారు. అక్కడి నుండి వారు సంతోషంగా తిరిగి వచ్చారు. అందువలన పట్టణం కోలాహలంగా ఉంది. మీకు వినబడిన శబ్దం అదే. అంతేగాక సొలొమోను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. ‘దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక’ అని చెప్పారు. అప్పుడు రాజు మంచం మీదే సాష్టాంగపడి నమస్కారం చేసి ‘నేను బతికి ఉండగానే ఈ రోజు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా సింహాసనం మీద కూర్చోడానికి నాకు ఒకణ్ణి ప్రసాదించాడు. ఇది నేను కళ్లారా చూశాను. ఆయనకు స్తుతి కలుగు గాక’ అన్నాడు” అని యోనాతాను చెప్పాడు. అందుకు అదోనీయా ఆహ్వానించిన వారు భయపడి లేచి, తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. అదోనీయా సొలొమోనుకు భయపడి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అదోనీయా బలిపీఠం కొమ్ములు పట్టుకుని “రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తితో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి” అని వేడుకుంటున్నాడని సొలొమోనుకు వార్త వచ్చింది. అందుకు సొలొమోను “అతడు తనను నిర్దోషిగా కనపరచుకోగలిగితే అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. కాని అతడు దోషి అని తేలితే అతనికి మరణశిక్ష తప్పదు” అని చెప్పి, బలిపీఠం దగ్గర నుండి అతణ్ణి పిలిపించాడు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడినపుడు సొలొమోను అతనితో “ఇక నీ ఇంటికి వెళ్ళు” అన్నాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 1

1 రాజులు 1:28-53 పవిత్ర బైబిల్ (TERV)

ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది. అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను: గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెరవేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.” తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది. రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు. “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ దగ్గరకు తీసుకొని వెళ్లండి. అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి. తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక! యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయపడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు. కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు. యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు. ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు. ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు. యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు. కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు. రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు. తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు. సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు. ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.” ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు. అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు. అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 1

1 రాజులు 1:28-53 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా–సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి–నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను. అప్పుడు రాజైన దావీదు–యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు–మీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొనిపోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి – రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను–ఆలాగు జరుగునుగాక, నా యేలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను; కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులును పెలేతీయులునురాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును–రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలువేసిరి మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని – పట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా – లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభసమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనీయాతో ఇట్లనెను–నిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరేగించిరి; యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే. మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు; అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కు వైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమస్కారము చేసి యిట్లనెను –నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని –రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఈలాగు సెలవిచ్చెను–అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనినయెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదుగాని అతనియందు దౌష్ట్యము కనబడినయెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో–నీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.

షేర్ చేయి
Read 1 రాజులు 1

1 రాజులు 1:28-53 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు రాజైన దావీదు, “బత్షెబను లోపలికి పిలువండి” అన్నాడు. ఆమె రాజు సముఖానికి వచ్చి అతని ఎదుట నిలబడింది. అపుడు రాజు ప్రమాణం చేసి, “నన్ను ప్రతి ఆపద నుండి కాపాడిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నేను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుస్తాను: నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అన్నాడు. అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది. రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి. అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి. అప్పుడు మీరు అతని వెంట వెళ్లాలి, అతడు వచ్చి నా సింహాసనం మీద ఆసీనుడై నా స్థానంలో పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు మీద యూదా మీద నేను అతన్ని పాలకునిగా నియమించాను” అని అన్నాడు. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “ఆమేన్! నా ప్రభువు దేవుడైన యెహోవా దానిని స్థిరపరచును గాక! యెహోవా రాజైన నా ప్రభువుతో ఉన్నట్లు సొలొమోనుతో ఉండి, అతని సింహాసనాన్ని నా ప్రభువును రాజునైన దావీదు సింహాసనం కంటే గొప్ప దానిగా చేయును గాక!” అన్నాడు. కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు. యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు. ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది. అదోనియా, అతనితో ఉన్న అతిథులందరు తమ విందు ముగింపులో ఆ ధ్వని విన్నారు. ఆ బూరధ్వని విని యోవాబు, “పట్టణంలో ఈ శబ్దమేంటి?” అని అడిగాడు. అతడు ఇంకా మాట్లాడుతుండగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాడు. అదోనియా, “లోపలికి రా, నీలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి మంచి వార్తను తెస్తాడు” అన్నాడు. అందుకు యోనాతాను అదోనియాతో, “కానే కాదు, మన ప్రభువా, రాజైన దావీదు సొలొమోనును రాజుగా చేశాడు. రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను అతనితో పాటు పంపాడు. వారు అతన్ని రాజు కంచరగాడిద మీద ఎక్కించారు. యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే. అంతేకాక సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. రాజ్యాధికారులు కూడా తమ ప్రభువైన దావీదు రాజుతో, ‘మీ దేవుడు సొలొమోనుకు మీకంటే ఎక్కువ ఖ్యాతి కలిగేలా, అతని సింహాసనాన్ని మీకంటే గొప్ప దానిగా చేయును గాక!’ అంటూ అభినందించారు. అప్పుడు రాజు తన మంచం మీద సాగిలపడి నమస్కరించి, ‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు. అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు. అయితే అదోనియా సొలొమోనుకు భయపడి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అప్పుడు, “అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అతడు, ‘రాజైన సొలొమోను తన దాసుడనైన నన్ను ఖడ్గంతో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి’ అని అంటున్నాడు” అని సొలొమోనుకు తెలిసింది. అందుకు సొలొమోను, “అతడు తనను తాను యోగ్యునిగా కనుపరచుకుంటే, తన తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలదు; కాని ఒకవేళ అతనిలో దోషం కనబడితే అతడు చస్తాడు” అన్నాడు. అప్పుడు రాజైన సొలొమోను మనుష్యులను పంపగా వారు అదోనియాను బలిపీఠం దగ్గర నుండి తీసుకువచ్చారు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాగిలపడ్డాడు, సొలొమోను అతనితో, “నీ ఇంటికి వెళ్లు” అన్నాడు.

షేర్ చేయి
Read 1 రాజులు 1