1 రాజులు 1

1
1రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక యుండెను. 2కాబట్టి వారు–మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి 3ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొని వచ్చిరి. 4ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెనుగాని రాజు దానిని కూడలేదు. 5హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై–నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్ప రచుకొనెను. 6అతని తండ్రి –నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యముగలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. 7అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచనచేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరిగాని 8యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి. 9అదోనీయా ఏన్‌రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్వినదూడలను బలిగా అర్పించి, రాజకుమారులగు తన సహోదరులనందరిని యూదావారగు రాజుయొక్క సేవకులనందరిని పిలిపించెనుగాని 10ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. 11అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగా–హగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన యేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది. 12కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము. 13నీవు రాజైన దావీదునొద్దకు పోయి –నా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను. 14రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను. 15కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టు చుండెను. 16బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారముచేయగా రాజు–నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె యీలాగు మనవి చేసెను 17–నా యేలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకు రాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే, 18ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజువునగు నీకు తెలియకయే యున్నది. 19అతడు ఎడ్లను క్రొవ్వినదూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజ కుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధి పతియైన యోవాబును పిలిపించెనుగాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు. 20నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయులందరును కనిపెట్టియున్నారు. 21ఇదిగాక నా యేలినవాడ వైన రాజువగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. 22ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగా –ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. 23అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి 24–నా యేలినవాడ వైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? 25ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైనయెడ్లను క్రొవ్వినదూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు–రాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు. 26అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. 27నా యేలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక యుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను. 28దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. 29అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా–సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు 30అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా 31బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి–నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను. 32అప్పుడు రాజైన దావీదు–యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. 33అంతట రాజు–మీరు మీ యేలిన వాడనైన నా సేవకులను పిలుచుకొనిపోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి 34యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి – రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. 35ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. 36అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను–ఆలాగు జరుగునుగాక, నా యేలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. 37యెహోవా నా యేలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను; 38కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులును పెలేతీయులునురాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా 39యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును–రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలువేసిరి 40మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. 41అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని – పట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా 42యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా – లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభసమాచారములతో వచ్చుచున్నావనగా 43యోనాతాను అదోనీయాతో ఇట్లనెను–నిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. 44రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరేగించిరి; 45యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే. 46మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు; 47అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కు వైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమస్కారము చేసి యిట్లనెను 48–నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. 49అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి. 50అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. 51అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని –రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా 52సొలొమోను ఈలాగు సెలవిచ్చెను–అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనినయెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదుగాని అతనియందు దౌష్ట్యము కనబడినయెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి 53బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో–నీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 1: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for 1 రాజులు 1