1 యోహాను 3:11-24

1 యోహాను 3:11-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి. నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి. మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు. తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు. ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి. ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము. దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి; మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము. ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము. ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.

1 యోహాను 3:11-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు. సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి. నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు. యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి. ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది? నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి. మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు. ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

1 యోహాను 3:11-24 పవిత్ర బైబిల్ (TERV)

“పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు. ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు. యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది? బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం. మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు, అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం. ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది. దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది. ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి. దేవుని ఆజ్ఞల్ని పాటించినవాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.

1 యోహాను 3:11-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ యేదనగా–ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలిసికొనుచున్నాము.