1 యోహాను 3:11-24

1 యోహాను 3:11-24 TELUBSI

మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ యేదనగా–ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలిసికొనుచున్నాము.