1 కొరింథీయులకు 15:3-14

1 కొరింథీయులకు 15:3-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు. లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు. ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు. దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు. అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు. అపొస్తలులందరిలో నేను అల్పమైనవాన్ని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను. అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే. కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు. మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు? మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా. అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.

1 కొరింథీయులకు 15:3-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు. ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు. చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు. అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను. నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు? మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు. క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం.

1 కొరింథీయులకు 15:3-14 పవిత్ర బైబిల్ (TERV)

నేను పొందినదాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతిపెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృథా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు. కాని మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయినవాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృథా అయినట్లే కదా!

1 కొరింథీయులకు 15:3-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలులకందరికిని కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను; ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రక టింపబడుచుండగా మీలో కొందరు–మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తు కూడ లేపబడియుండలేదు. మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేముచేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.