1 కొరింథీయులకు 12:1-31
1 కొరింథీయులకు 12:1-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు యూదేతరులుగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు. అందువల్ల దేవుని ఆత్మచే మాట్లాడేవారు ఎవరూ “యేసు శపింపబడును గాక” అని పలుకలేరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అందరి మంచి కొరకు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఒకరికి ఆత్మ ద్వారా జ్ఞాన సందేశం ఇవ్వబడింది, అదే ఆత్మ ద్వారా మరొకరికి విజ్ఞత సందేశం ఇవ్వబడింది. అదే ఆత్మ ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. ఆత్మ ఒకరికి అద్బుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు. ఇవన్ని ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరికి వాటిని పంచి ఇస్తున్నాడు. ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు. అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదులు కాని వారైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు. శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలతో రూపొందించబడింది. “నేను చెయ్యి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. “నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు? అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచాడు. అవన్ని ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? కనుక అనేక అవయవాలు ఉన్నాయి గాని, శరీరం ఒక్కటే. కాబట్టి, “నీతో నాకు అవసరం లేదు!” అని కన్ను చేతితో చెప్పకూడదు. “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు. అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా, అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశాడు. అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగివుండడానికి ఆయన అలా చేశారు. ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి. కావున మీరందరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. మరియు దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తరువాత అద్బుతాలు చేసేవారిని, ఆ తరువాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్బుతాలు చేయగలరా? అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషలలో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? కనుక శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి.
1 కొరింథీయులకు 12:1-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరీ సోదరులారా, ఆత్మవరాలను గూర్చి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. పూర్వం మీరు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు కొట్టుకుపోతూ మూగవిగ్రహాలను ఆరాధించేవారని మీకు తెలుసు. అందుచేత నేను మీతో చెప్పేదేమంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడే వారెవరూ, “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరూ, “యేసే ప్రభువు” అని చెప్పలేరు. దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. అలాగే ప్రభువు ఒక్కడే గాని పరిచర్యలు వేరు వేరు విధాలు. వేరు వేరు కార్యాలు ఉన్నాయి గాని అందరిలో, అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు. శరీరం ఒక్కటే, అందులో అనేక అవయవాలు ఉన్నాయి. అవన్నీ ఒకే శరీరంలో అవయవాలైనా శరీరం ఒకటే. క్రీస్తు కూడా అలానే ఉన్నాడు. ఎలాగంటే, యూదులైనా, గ్రీకులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమంతా ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలోనే బాప్తిసం పొందాం. మనమంతా ఒకే ఆత్మను పానం చేశాం. శరీరం అంటే ఒక్క అవయవమే కాదు, అది అనేక అవయవాలతో ఉంది. పాదం ‘నేను చేతిని కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. అలాగే చెవి ‘నేను కన్ను కాదు కాబట్టి శరీరంతో నాకు సంబంధం లేదు’ అని చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. శరీరమంతా ఒక్క కన్నే ఉంటే ఇక వినడం ఎలా? శరీరమంతా ఒక్క చెవే అయితే వాసన ఎలా చూడాలి? అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? అయితే ఇప్పుడు అవయవాలు అనేకం, శరీరం మాత్రం ఒక్కటే. కాబట్టి కన్ను చేతితో, “నీవు నాకక్కర లేదు” అనీ, తల పాదాలతో, “మీరు నాకక్కర లేదు” అనీ చెప్పడానికి వీలు లేదు. అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం. అందమైన అవయవాలకు మరింత అందం అక్కర లేదు. ఆ విధంగా దేవుడు శరీరంలో వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరొకటి శ్రద్ధ వహించేలాగా, తక్కువ దానికే ఎక్కువ ఘనత కలిగించి, శరీరాన్ని అమర్చాడు. కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
1 కొరింథీయులకు 12:1-31 పవిత్ర బైబిల్ (TERV)
సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు. దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు. దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు. శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు. మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే. కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది. మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.
1 కొరింథీయులకు 12:1-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము లను మరియొకనికి అద్భుతకార్యములనుచేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మ ను పానము చేసినవారమైతిమి. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. –నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరము లోనిది కాక పోలేదు. మరియు–నేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్న యితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీర మొక్కటే. గనుక కన్ను చేతితో–నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో – మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమై యుండి వేరు వేరుగా అవయవములై యున్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా? అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేప్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
1 కొరింథీయులకు 12:1-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు. అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని, ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు. ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు. ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు. అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదేతరులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు. శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది. “నేను చేయి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. “నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు? అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదాన్ని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచారు. అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే. కాబట్టి, “నీతో నాకు అవసరం లేదు!” అని కన్ను చేతితో చెప్పకూడదు. “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు. అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా, అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశారు. అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగి ఉండడానికి ఆయన అలా చేశారు. ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి. కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతాలు చేయగలరా? అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? కాబట్టి శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి.