1 కొరింథీ పత్రిక 12

12
ఆత్మ సంబంధమైన వరాలు
1సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. 2మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు. 3అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
4అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. 5అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే. 6అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.
7అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. 8ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని, 9ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు. 10ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు. 11ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.
శరీరంలో ఏకత్వం భిన్నత్వం
12ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు. 13అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదేతరులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు. 14శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.
15“నేను చేయి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. 16“నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు. 17శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు? 18అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదాన్ని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచారు. 19అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? 20కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే.
21కాబట్టి, “నీతో నాకు అవసరం లేదు!” అని కన్ను చేతితో చెప్పకూడదు. “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు. 22అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, 23ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా, 24అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశారు. 25అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగి ఉండడానికి ఆయన అలా చేశారు. 26ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.
27కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే. 28దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు. 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతాలు చేయగలరా? 30అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా? 31కాబట్టి శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి.
ప్రేమ అత్యవసరమైనది
ఇదే కాకుండా, అన్నిటికంటే శ్రేష్ఠమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 కొరింథీ పత్రిక 12: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

1 కొరింథీ పత్రిక 12 కోసం వీడియో