1 దినవృత్తాంతములు 17:16-24

1 దినవృత్తాంతములు 17:16-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని ఈ విధంగా మనవి చేశాడు. “దేవా యెహోవా, నువ్వు నన్ను ఇలాటి ఉన్నత స్థితికి తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఏమాత్రం? దేవా, ఇది నీ దృష్టిలో చిన్న విషయమే. దేవా యెహోవా, నువ్వు దూర భవిషత్తులో ఉండబోయే నీ సేవకుని సంతతినిగూర్చి చెప్పి, ముందు తరాలను నాకు చూపించావు. నీ దాసుడైన నాకు కలుగబోయే ఘనతను గూర్చి దావీదు అనే నీ దాసుడనైన నేను నీతో ఇంకా ఏమని మనవి చెయ్యను? నువ్వు నీ దాసునికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చావు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారం ఈ మహా ఘనత కలుగుతుందని నువ్వు తెలియచేశావు. అతని నిమిత్తమే నువ్వు ఈ గొప్ప కార్యం చేశావు. యెహోవా, మేము మా చెవులతో విన్నదంతా నిజం. నీలాంటివాడు ఎవ్వడూ లేడు. నువ్వు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు. నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నిత్యం నీకు ప్రజలయ్యేలా నువ్వు ఆ విధంగా చేశావు. యెహోవావైన నువ్వు వాళ్లకు దేవుడివయ్యావు. యెహోవా, ఇప్పుడు నీ దాసుని గూర్చీ, అతని సంతతిని గూర్చీ నువ్వు చెప్పిన మాట నిత్యం స్థిరమౌతుంది గాక. ఇశ్రాయేలీయుల దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరుకు ఎన్నటికీ ఘనత వచ్చేలా నువ్వు చెప్పిన మాట నిశ్చయంగా స్థిరమౌతుంది గాక. ఇంకా, నీ దాసుడైన దావీదు సంతతి నీ సన్నిధిలో స్థిరపడు గాక.

1 దినవృత్తాంతములు 17:16-24 పవిత్ర బైబిల్ (TERV)

అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు. వాటన్నిటికీ మించి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు! నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు! నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు! ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు! “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు ‘సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని’ ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.

1 దినవృత్తాంతములు 17:16-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది? దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.

1 దినవృత్తాంతములు 17:16-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “దేవా యెహోవా, మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది? ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు. “మీ సేవకుని ఘనపరుస్తున్నందుకు దావీదు మీతో ఇంకేం చెప్పగలడు? మీ సేవకుని గురించి మీకు తెలుసు. యెహోవా! మీ సేవకుని కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి ఈ గొప్ప వాగ్దానాలన్నిటిని తెలియజేశారు. “యెహోవా! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు. మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు. మీ ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు. “ఇప్పుడు యెహోవా, మీ సేవకుడనైన నా గురించి నా కుటుంబం గురించి మీరు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరపరచబడాలి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి, అప్పుడు అది సుస్థిరమై మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు మీద దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు!’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.