1 దినవృత్తాంతములు 17

17
దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం
1దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత, అతడు నాతాను ప్రవక్తతో, “ఇదిగో, యెహోవా నిబంధన మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.
2అందుకు నాతాను దావీదుతో, “దేవుడు నీకు తోడుగా ఉన్నారు, కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.
3అయితే ఆ రాత్రి దేవుని వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
4“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవు కాదు. 5ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. ఒక గుడారం నుండి మరో గుడారానికి, ఒక నివాసస్థలం నుండి మరో స్థలానికి మారుతూ వచ్చాను. 6ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో#17:6 లేదా న్యాయాధిపతులు 10 వచనంలో కూడా ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
7“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను. 8నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి పేరు నీకు ఇస్తాను. 9నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు, 10అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను.
“ ‘యెహోవా నీకు రాజవంశాన్ని ఇస్తారని నేను నీకు ప్రకటిస్తున్నాను: 11నీ దినాలు ముగిసి నీ పూర్వికుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తుతాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. 12నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను. 13నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. నీకంటే ముందున్న వానికి నేను నా ప్రేమను దూరం చేసినట్లుగా అతనికి ఎప్పుడూ దూరం చేయను. 14నా ఇంటి మీద, నా రాజ్యం మీద నేను అతన్ని నిత్యం స్థిరపరుస్తాను; అతని సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
15నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
దావీదు ప్రార్థన
16అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు:
“దేవా యెహోవా, మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది? 17ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు.
18“మీ సేవకుని ఘనపరుస్తున్నందుకు దావీదు మీతో ఇంకేం చెప్పగలడు? మీ సేవకుని గురించి మీకు తెలుసు. 19యెహోవా! మీ సేవకుని కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి ఈ గొప్ప వాగ్దానాలన్నిటిని తెలియజేశారు.
20“యెహోవా! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు. 21మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు. 22మీ ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.
23“ఇప్పుడు యెహోవా, మీ సేవకుడనైన నా గురించి నా కుటుంబం గురించి మీరు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరపరచబడాలి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి, 24అప్పుడు అది సుస్థిరమై మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు మీద దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు!’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.
25“నా దేవా! నా కోసం రాజవంశాన్ని స్థాపిస్తాను అని మీరు మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది. 26యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు. 27ఇప్పుడు మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించడం మీకు ఇష్టమైనది; ఎందుకంటే యెహోవా, మీరు దానిని దీవిస్తే అది శాశ్వతంగా దీవించబడుతుంది.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 17: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి