1 దినవృత్తాంతములు 14:1-17

1 దినవృత్తాంతములు 14:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దావీదుకు రాజభవనం నిర్మించడానికి దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు. ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని ఎంతో గొప్ప చేశారని దావీదు గ్రహించాడు. దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా చేసుకుని ఇంకా చాలామంది కుమారులకు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఎలీషువ, ఎల్పెలెతు, నోగహు, నెఫెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కోడానికి వెళ్లాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దాడి చేశారు. అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని దేవుని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు. కాబట్టి దావీదు తన మనుష్యులతో బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా దేవుడు నా శత్రువులను నా ఎదుట ఉండకుండ నా చేత నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టారు. ఫిలిష్తీయులు తమ దేవతల విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు వాటిని అగ్నిలో కాల్చివేయమని ఆజ్ఞాపించాడు. మరోసారి ఫిలిష్తీయులు అదే లోయలో దాడి చేశారు. కాబట్టి దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు, “నీవు నేరుగా వారి వెనుక వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి, కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి. కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే, యుద్ధానికి బయలుదేరు. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు నీ ముందుగా వెళ్లారని దాని అర్థం” అని జవాబిచ్చారు. కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, వారు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయుల సైన్యాన్ని తరుముతూ వారిని హతం చేశారు. కాబట్టి దావీదు కీర్తి అన్ని దేశాలకు వ్యాపించింది. యెహోవా ఇతర దేశాలన్నీ అతనికి భయపడేలా చేశారు.

1 దినవృత్తాంతములు 14:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు. తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు. యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు. దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు. “ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు. వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది. ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు. దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు. కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు. దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.

1 దినవృత్తాంతములు 14:1-17 పవిత్ర బైబిల్ (TERV)

తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు. యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు. యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు. యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు. దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు. ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు. అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు. యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు. తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము అని పేరు పెట్టబడింది. ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు. రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు మళ్ళీ దాడి చేశారు. దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు. ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల క్రింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!” దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు. అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.

1 దినవృత్తాంతములు 14:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను. తన జనులగు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబడెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి. ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవా –పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసి–జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరుపెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడు–నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లియున్నాడని తెలిసికొనుమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదుచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గెజెరువరకు తరిమి హతముచేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనులకందరికి కలుగజేసెను.