1 దినవృత్తాంతములు 11:10-25

1 దినవృత్తాంతములు 11:10-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే. దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు. ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు. ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు. అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు. ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు. ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు. దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. “బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?” అన్నాడు. కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు. తరువాత ఇలా అన్నాడు “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?” అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు. యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది. ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు. ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు. ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు. ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు. ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.

1 దినవృత్తాంతములు 11:10-25 పవిత్ర బైబిల్ (TERV)

దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు. దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి. అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు. దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు. కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు. ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు. అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు. ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు. యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.

1 దినవృత్తాంతములు 11:10-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమశాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి–బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ద బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి –నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను. ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెనుగాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను. అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేతపట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను. ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెనుగాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకులకధిపతిగా ఉంచెను.

1 దినవృత్తాంతములు 11:10-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు. ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా: అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము; అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు. అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు ముగ్గురు యోధులలో ఒకడు. ఒకసారి ఫిలిష్తీయులు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చినప్పుడు అతడు దావీదుతో పాటు ఉన్నాడు. యవలు నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు. కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ముప్పైమంది ప్రముఖులలో ముగ్గురు అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది. ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు. ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది. దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు. “నేను ఈ నీళ్లు త్రాగకుండా నా దేవుడు నన్ను కాపాడును గాక! ప్రాణానికి తెగించి వెళ్లి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను త్రాగాలా?” అన్నాడు. వాటిని తీసుకురావడానికి వారు తమ ప్రాణాలకు తెగించి తెచ్చారు కాబట్టి దావీదు ఆ నీళ్లు త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి. యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు. అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు. గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు. ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.