1 దినవృత్తాంతములు 11:10-25

1 దినవృత్తాంతములు 11:10-25 OTSA

ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు. ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా: అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము; అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు. అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు ముగ్గురు యోధులలో ఒకడు. ఒకసారి ఫిలిష్తీయులు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చినప్పుడు అతడు దావీదుతో పాటు ఉన్నాడు. యవలు నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు. కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ముప్పైమంది ప్రముఖులలో ముగ్గురు అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది. ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు. ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది. దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు. “నేను ఈ నీళ్లు త్రాగకుండా నా దేవుడు నన్ను కాపాడును గాక! ప్రాణానికి తెగించి వెళ్లి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను త్రాగాలా?” అన్నాడు. వాటిని తీసుకురావడానికి వారు తమ ప్రాణాలకు తెగించి తెచ్చారు కాబట్టి దావీదు ఆ నీళ్లు త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి. యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు. అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు. గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు. ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.