అపొస్తలుల కార్యములు 3
3
పేతురు, యోహానులు కుంటి బిక్షగాడిని స్వస్థపరచుట
1ఒక రోజు పేతురు మరియు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల వేళలో ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు. 2సుందరమని పిలువబడే ఆ దేవాలయ ద్వారం దగ్గర కూర్చుని, ఆవరణంలోనికి వచ్చేవారి దగ్గర భిక్షం అడుక్కోడానికి పుట్టుకతోనే కుంటివాడైన ఒకనిని ప్రతి రోజు కొంతమంది మోసుకొచ్చేవారు. 3పేతురు యోహానులు ఆ దేవాలయ ఆవరణంలోనికి ప్రవేశిస్తుండగా వాడు చూసి భిక్షమడిగాడు. 4యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు. 5వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూసాడు.
6అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి, 7వాని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి. 8వాడు లేచి ఎగిరి తన కాళ్ళపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. 9ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి, 10సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని భిక్షమడిగేవాడు వీడే అని గుర్తించి, వానికి జరిగిన దానిని బట్టి విస్మయం చెంది ఆశ్చర్యపడ్డారు.
చూస్తున్నవారితో పేతురు మాట్లాడడం
11స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు. 12అది చూసిన పేతురు వారితో ఈ విధంగా చెప్పాడు: “తోటి ఇశ్రాయేలీయులారా, జరిగింది చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా స్వశక్తితోనో లేక మా భక్తితోనో వీడిని నడిచేలా చేసినట్లు మీరు మా వైపే తదేకంగా చూస్తున్నారేమిటి? 13మన పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకొన్నప్పటికి, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు. 14మీరు పరిశుద్ధుడు, నీతిమంతుడైన వానిని తిరస్కరించి నరహంతుకుడిని మీ కొరకు విడుదల చేయమని అడిగారు. 15మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులం. 16యేసు నామంలోని విశ్వాసం చేత, మీరు చూసిన మీకు తెలిసిన ఇతడు బలపరచబడ్డాడు. మీరందరు చూస్తునట్లే ఇది యేసు పేరట మరియు ఆయన ద్వార కలిగే విశ్వాసమే, ఇతన్ని పూర్తిగా స్వస్థపరచింది.
17“అయితే, నాతోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంలో చేశారని నాకు తెలుసు. 18అయితే దేవుడు తన క్రీస్తు తప్పక హింసించబడతాడని ప్రవక్తలందరి ద్వారా ముందుగానే తెలియపరచిన దానిని దేవుడు ఈ విధంగా నెరవేర్చారు. 19పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి, ప్రభువు దగ్గర నుండి విశ్రాంతి కాలాలు రావచ్చు. 20మీ కొరకు నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. 21దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేసినట్లుగా, దేవుడు సమస్తాన్ని పునరుద్ధరించడానికి సమయం వచ్చేవరకు, పరలోకం ఆయనను చేర్చుకోవల్సిందే. 22అందుకే మోషే, ‘మీ దేవుడైన ప్రభువు నా లాంటి ప్రవక్తను మీలో నుండి మీ కొరకు లేపుతాడు, ఆయన మీతో చెప్పే వాటన్నింటిని మీరు ఖచ్చితంగా వినాలి. 23ఆయన చెప్పిన మాటలు వినని వారు వారి ప్రజల నుండి తొలగించబడాలి’ అని చెప్పాడు.#3:23 ద్వితీ 18:15,18,19
24“నిజానికి సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరు ఈ రోజుల గురించి ముందే ప్రవచించారు. 25మీరు ప్రవక్తలకు మరియు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’#3:25 ఆది 22:18; 26:4 అని వాగ్దానం చేశారు. 26దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో ప్రతి ఒక్కరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 3: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.