లూకా సువార్త 9

9
యేసు పన్నెండుమందిని పంపుట
1యేసు పన్నెండుమందిని దగ్గరకు పిలిచి దయ్యాలను వెళ్లగొట్టడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి శక్తి, అధికారం ఇచ్చి, 2దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారిని పంపారు. 3ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. 4మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి. 5ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును దులిపి వారి గ్రామం విడిచి వెళ్లిపొండి” అని చెప్పారు. 6కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ప్రతిచోట రోగులను స్వస్థపరుస్తూ గ్రామ గ్రామానికి వెళ్లారు.
7జరుగుతున్న సంగతులన్నిటి గురించి చతుర్థాధిపతియైన హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అని చెప్పుకుంటున్నారు, 8మరికొందరు ఏలీయా కనబడ్డాడని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. 9అయితే హేరోదు, “నేను యోహాను తలను తీయించాను కదా, మరి నేను వింటున్నది, ఎవరి గురించి?” అని అనుకున్నాడు. అతడు ఆయనను చూడాలని ప్రయత్నించాడు.
యేసు అయిదు వేలమందికి ఆహారమిచ్చుట
10అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు, 11అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు.
12ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు.
13అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు.
అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు. 14ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.
అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు. 15వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు. 16అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. 17వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
యేసే క్రీస్తు అని తెలియజేసిన పేతురు
18ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు.
19అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు.
20అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు.
అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
21ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. 22ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
23ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. 24తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు. 25ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? 26ఎవరైనా నా గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.
27“ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
రూపాంతరము
28యేసు ఈ సంగతి చెప్పిన ఎనిమిది రోజుల తర్వాత, ఆయన పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదికి వెళ్లారు. 29ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి. 30అప్పుడు మోషే, ఏలీయా అనే ఇద్దరు వ్యక్తులు యేసుతో మాట్లడుతూ అద్భుతమైన ప్రకాశంతో కనబడ్డారు. 31యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న, ఆయన నిష్క్రమణ#9:31 నిష్క్రమణ అంటే నిర్గమం గురించి వారు మాట్లాడారు. 32పేతురు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూశారు 33ఆ ఇద్దరు వ్యక్తులు యేసును విడిచి వెళ్తుండగా, పేతురు ఆయనతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది. మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని అన్నాడు. తాను ఏమి చెప్తున్నాడో తనకే తెలియదు.
34అతడు మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం ప్రత్యక్షమై వారిని కమ్ముకుంది, వారు దానిలోనికి వెళ్లినప్పుడు వారు భయపడ్డారు. 35ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన, నేను ఏర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన చెప్పేది వినండి” అని చెప్పడం వినబడింది. 36ఆ స్వరం మాట్లాడినప్పుడు, వారు యేసు ఒంటరిగా ఉండడం చూశారు శిష్యులు తాము చూసినవాటిని గురించి ఎవరికి చెప్పకుండా తమ మనస్సులోనే ఉంచుకున్నారు.
దయ్యం పట్టిన బాలున్ని యేసు స్వస్థపరచుట
37మరుసటిరోజు, వారు కొండ దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. 38ఆ జనసమూహంలోని ఒకడు బిగ్గరగా పిలిచి, “బోధకుడా, దయచేసి నా కుమారుని వైపు చూడు, నాకు వీడు ఒక్కడే కుమారుడు. 39అపవిత్రాత్మ వీనిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు; అది వాన్ని మూర్ఛపోయేలా చేస్తుంది అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు. వానిని విలవిలలాడించి వేధించి వదలుతుంది. 40దానిని వెళ్లగొట్టమని మీ శిష్యులను బ్రతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు.
41యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహిస్తాను? నీ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురా” అన్నారు.
42వాడు వస్తుండగానే, ఆ దయ్యం వానిని క్రింద పడద్రోసి మూర్ఛపోయేలా చేసింది. కాని యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి, ఆ బాలుని స్వస్థపరచి అతని తండ్రికి అప్పగించారు. 43దేవుని గొప్పతనాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు.
రెండవసారి తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
యేసు చేసినదంతటిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉంటే, ఆయన తన శిష్యులతో, 44“నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు. 45అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కాబట్టి వారు దానిని తెలుసుకోలేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు.
46అప్పుడే వారిలో ఎవరు గొప్ప అని శిష్యుల మధ్య వాదం పుట్టింది. 47యేసు, వారి ఆలోచనలను తెలుసుకొని, ఒక చిన్నబిడ్డను తన ప్రక్కన నిలబెట్టుకున్నారు. 48తర్వాత ఆయన వారితో, “ఎవరు ఈ చిన్నబిడ్డను నా పేరట చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే; నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే. ఎందుకంటే మీ అందరిలో చివరివానిగా ఉండేవారే గొప్పవారు” అని చెప్పారు.
49యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపే ప్రయత్నం చేశాం, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు.
50అందుకు యేసు, “అలా ఆపవద్దు, ఎందుకంటే, మీకు విరోధి కాని వాడు మీ పక్షంగా ఉన్నవాడు” అని చెప్పారు.
సమరయుల వ్యతిరేకత
51తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు. 52తన కోసం బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయుల గ్రామానికి పంపారు. 53కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు. 54ఆయన శిష్యులైన యాకోబు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు. 55అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు. 56ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు.
యేసును వెంబడించుటకు చెల్లించవలసిన వెల
57వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, “నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అని అన్నాడు.
58అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు.
59ఆయన ఇంకొకనితో, “నన్ను వెంబడించు” అన్నారు.
అందుకు అతడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!” అని అన్నాడు.
60యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు.
61ఇంకొకడు ఆయనతో, “ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా” అన్నాడు.
62అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లూకా సువార్త 9: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

లూకా సువార్త 9 కోసం వీడియోలు