లూకా సువార్త 7
7
శతాధిపతి యొక్క విశ్వాసం
1తన మాటలు వింటున్న ప్రజలకు యేసు ఇదంతా చెప్పడం ముగించిన తర్వాత, ఆయన కపెర్నహూములో ప్రవేశించారు. 2అక్కడ శతాధిపతికి ఎంతో ఇష్టమైన పనివాడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. 3ఆ శతాధిపతి యేసు గురించి విని, యేసును వచ్చి తన దాసుని స్వస్థపరచుమని బ్రతిమాలడానికి యూదా నాయకుల్లో కొందరిని ఆయన దగ్గరకు పంపించాడు. 4వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బ్రతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు, 5ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు. 6కాబట్టి యేసు వారితో కూడ వెళ్లారు.
ఆయన ఆ ఇంటికి దగ్గరగా ఉండగానే, శతాధిపతి తన స్నేహితులను పంపించి, “ప్రభువా, అంత శ్రమ తీసుకోవద్దు, నీవు నా ఇంటికప్పు క్రిందికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు. 7అందుకే, నేను నీ దగ్గరకు రావడానికి కూడా నాకు యోగ్యత లేదని నేను అనుకుంటున్నాను. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. 8ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
9యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి, తనను వెంబడిస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఆయన ఇలా అన్నారు, “ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో కూడా కనుగొనలేదని మీతో చెప్తున్నాను.” 10అప్పుడు శతాధిపతిచే పంపబడినవారు ఇంటికి చేరి ఆ సేవకుడు ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తించారు.
యేసు ఒక విధవరాలి కుమారుని జీవంతో లేపుట
11అది యైన వెంటనే, యేసు నాయీను అనే ఒక గ్రామానికి వెళ్లారు, ఆయన శిష్యులు పెద్ద జనసమూహం ఆయన వెంట వెళ్లారు. 12ఆయన ఆ గ్రామ ద్వారాన్ని చేరినప్పుడు, చనిపోయిన వానిని బయటకు మోసుకొనిపోతున్నారు. వాని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె ఒక విధవరాలు; ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద గుంపు ఆమెతో పాటు ఉంది. 13ప్రభువు ఆమెను చూసి, ఆమె మీద కనికరపడి, “ఏడవవద్దు” అని ఆమెతో అన్నారు. దానిని మోసేవారు ఆగిపోయి నిలబడ్డారు.
14అప్పుడు ఆయన వారు మోసుకెళ్తున్న పాడెను ముట్టారు, దానిని మోస్తున్నవారు ఆగిపోయారు. అప్పుడు ఆయన, “నేను నీతో చెప్తున్నాను, చిన్నవాడా, లే!” అన్నారు. 15ఆ చనిపోయినవాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు, యేసు వానిని అతని తల్లికి అప్పగించారు.
16వారందరు దేవుని భయంతో నిండి, “మన మధ్య ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు, దేవుడే తన ప్రజలను దర్శించాడు” అని అంటూ దేవుని స్తుతించారు. 17ఆయన గురించి ఈ సమాచారం యూదయ చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది.
యేసు దగ్గరకు పంపబడిన బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు
18యోహాను శిష్యులు ఈ సంగతులన్నిటిని యోహానుకు తెలియజేశారు. 19అయితే యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, వారిని ప్రభువు దగ్గరకు పంపించి, “రావలసిన వాడవు నీవేనా లేదా మేము వేరొకరి కోసం చూడాలా?” అని అడగమన్నాడు.
20ఆ మనుష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మమిచ్చే యోహాను మమ్మల్ని నీ దగ్గరకు పంపి, ‘రావలసిన వాడవు నీవేనా? లేదా మేము మరొకరి కోసం ఎదురుచూడాలా?’ అని అడగమన్నాడు” అని చెప్పారు.
21ఆ సమయంలోనే యేసు అనేకమంది రోగులను, అనారోగ్యం గలవారిని, దయ్యాలు పట్టినవారిని స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపునిచ్చారు. 22కాబట్టి యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి; గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. 23నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు.
24యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యేసు యోహానును గురించి జనసమూహంతో ఈ విధంగా చెప్పారు: “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా? 25అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించి విలాసవంతంగా జీవించేవారు రాజభవనాల్లో ఉంటారు. 26అయితే ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను. 27వాక్యంలో ఇతని గురించే ఈ విధంగా వ్రాయబడింది:
“ ‘ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను,
అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’#7:27 మలాకీ 3:1
28స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు; అయినప్పటికీ, దేవుని రాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని, నేను చెప్తున్నాను” అన్నారు.
29ప్రజలందరు, పన్ను వసూలు చేసేవారితో సహా అంతా యేసు మాటలు విని, దేవుని మార్గం సరియైనది అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నారు. 30పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు యోహాను చేత బాప్తిస్మం పొందక, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని నిరాకరించారు.
31యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు? 32వారు వీధిలో ఆడుకుంటూ చాడీలు చెప్పుకునే చిన్న పిల్లల్లాంటివారు:
“ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం,
కాని మీరు నాట్యం చేయలేదు;
మేము విషాద గీతం పాడాం,
కాని మీరు ఏడవలేదు.’
33ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు. 34మరోవైపు మనుష్యకుమారుడు తింటున్నాడు త్రాగుతున్నాడు కాబట్టి మీరు, ‘ఇదిగో తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు. 35కాని జ్ఞానం సరియైనదని దాని పిల్లలందరిని బట్టే నిరూపించబడుతుంది.”
యేసు పాదాలను అభిషేకించిన ఒక పాపిష్ఠిదైన స్త్రీ
36పరిసయ్యులలో ఒకడు యేసును తనతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానించాడు, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. 37ఆ గ్రామంలోని పాపిష్ఠిదైన ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో యేసు భోజనం చేస్తున్నాడని తెలుసుకొని, పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తీసుకుని వచ్చింది. 38ఆమె ఆయన వెనుక పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ, ఆమె తన కన్నీటితో ఆయన పాదాలు తడపడం మొదలుపెట్టింది. తర్వాత తన తలవెంట్రుకలతో వాటిని తుడిచి, గౌరవంతో ఆయన పాదాలకు ముద్దు పెడుతూ పరిమళద్రవ్యాన్ని పూసింది.
39ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూసి, తనలో తాను, “ఈయన ఒక ప్రవక్త అయితే తనను ముట్టినది ఒక పాపాత్మురాలని గ్రహించేవాడు” అనుకున్నాడు.
40యేసు దాని గురించి, “సీమోను, నీతో ఒక మాట చెప్పాలి” అన్నారు.
అతడు, “చెప్పండి బోధకుడా” అన్నాడు.
41అప్పుడు యేసు, “అప్పు ఇచ్చే వాని దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు అయిదువందల దేనారాలు,#7:41 దేనారం అంటే, సాధారణంగా ఒక రోజు కూలి మరొకడు యాభై దేనారాలు అప్పు తీసుకున్నారు. 42ఆ అప్పు తీర్చడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేదని అతడు వారిద్దరి అప్పును క్షమించాడు. కాబట్టి వారిద్దరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, చెప్పు?” అని అడిగారు.
43అందుకు సీమోను, “అతడు, ఎవని అప్పును ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అని చెప్పాడు.
యేసు, “నీవు సరిగా అంచనా వేశావు” అని అతనితో చెప్పారు.
44తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు గాని, ఈమె తన కన్నీటితో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది. 45నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి, ఈమె నా పాదాలకు ముద్దు పెట్టడం మానలేదు. 46నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. 47కాబట్టి నేను నీతో చెప్పేది ఏమనగా, ఆమె విస్తారంగా ప్రేమ చూపినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాని ఎవరి పాపాలు కొంచెమే క్షమించబడ్డాయో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పారు.
48అప్పుడు యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.
49అందుకు అక్కడ ఆయనతో భోజన పంక్తిలో కూర్చుండిన వారు తమలో తాము, “పాపాలు కూడా క్షమిస్తున్నాడు ఈయన ఎవరు?” అని అనుకోవడం మొదలుపెట్టారు.
50అప్పుడు యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లూకా సువార్త 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.