లూకా సువార్త 11

11
ప్రార్థనను గురించి బోధించిన యేసు
1ఒక రోజు యేసు ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకు నేర్పించు” అని ఆయనను అడిగాడు.
2ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు:
“ ‘తండ్రీ,#11:2 కొ.ప్ర.లలో పరలోకంలో ఉన్న మా తండ్రి
మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చును గాక.#11:2 కొ.ప్ర.లలో వచ్చు గాక. మీ చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమి మీద జరుగును గాక.
3మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.
4మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు,#11:4 గ్రీకులో మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మాకు రుణపడి ఉన్నవారిని
మా పాపాలను క్షమించండి.
మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’#11:4 కొ.ప్ర.లలో శోధనలోకి నడిపించక, దుష్టుని నుండి విడిపించండి
5-6ఆ తర్వాత యేసు వారితో, “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే; 7లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి. 8నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి#11:8 లేదా తన మంచి పేరు కాపాడుకోడానికైనా అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.
9“అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. 10అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
11“మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప#11:11 కొ.ప్ర.లలో రొట్టె అడిగితే, అతనికి రాయి ఇస్తాడా? అడిగితే పాము ఇస్తారా? 12వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా? 13మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”
యేసు బయల్జెబూలు
14ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు. 15అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. 16మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు.
17యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది. 18ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్న ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి. 19ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు. 20కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
21“బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది. 22అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకున్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు.
23“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.
24“అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు. అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. 25అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది. 26అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది.”
27యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది.
28అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు.
యోనా సూచన
29జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, “ఇది దుష్టతరము. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు. 30నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. 31దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది. 32నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు.
నీ దేహానికి దీపం
33“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. 34నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. 35నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. 36కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.
పరిసయ్యులు ధర్మశాస్త్ర నిపుణులకు శ్రమ
37యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. 38అయితే యేసు యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు.
39అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు. 40అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా? 41కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది.
42“పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది.
43“పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండడానికి, సంత వీధుల్లో గౌరవం అందుకోవడానికి ఇష్టపడుతున్నారు.
44“మీకు శ్రమ! మీరు సరిగా గుర్తుపట్టలేని సమాధుల్లా ఉన్నారు, తెలియక ప్రజలు వాటి మీద నడుస్తారు.”
45ధర్మశాస్త్ర నిపుణులలో ఒకడు, “బోధకుడా, నీవిలా చెప్పి, మమ్మల్ని అవమానపరుస్తున్నావు” అని ఆయనతో అన్నాడు.
46అందుకు యేసు, “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, మీరు మోయలేని బరువులను ప్రజలతో మోయిస్తూ, కనీసం ఒక వ్రేలి మోతనైనా మోసి వారికి సహాయపడరు.
47“మీకు శ్రమ, ఎందుకంటే మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, కాని వారిని చంపింది మీ పితరులే. 48దీనిని బట్టి మీ పితరులు చేసిన వాటిని మీరు సమ్మతిస్తున్నట్లు సాక్ష్యమిస్తున్నారు; వారు ప్రవక్తలను చంపారు, మీరు వారికి సమాధులను కడుతున్నారు. 49ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’ 50కాబట్టి లోక ఆరంభం నుండి చిందించబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది, 51అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు.
52“ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.”
53అక్కడినుండి యేసు బయటకు వెళ్లినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రశ్నలతో ఆయనను చిక్కులు పెట్టాలని, 54ఆయన చెప్పే మాటల్లో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లూకా సువార్త 11: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి