రోమా పత్రిక 8:18-37

రోమా పత్రిక 8:18-37 OTSA

మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ. నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము. అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు. అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.” అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.

Read రోమా పత్రిక 8

రోమా పత్రిక 8:18-37 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to రోమా పత్రిక 8:18-37