రోమా పత్రిక 8:1-14

రోమా పత్రిక 8:1-14 OTSA

కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది. శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు. క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది. యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు. కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు.

Read రోమా పత్రిక 8

రోమా పత్రిక 8:1-14 కోసం వీడియో