కీర్తనలు 72:1-17

కీర్తనలు 72:1-17 OTSA

ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి. ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక. పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక. ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక. సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక. ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా, భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక. ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు. ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు. తన శత్రువులు మట్టిని నాకుతారు. తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు. రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక. అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు. ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, పేదవారిని మరణం నుండి రక్షిస్తారు. ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది. రాజు దీర్ఘకాలం జీవించును గాక! షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. రోజంతా ఆయనను స్తుతించుదురు గాక. దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; కొండల పైభాగాన అది ఆడించబడును గాక. పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక. ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక.