కీర్తనలు 31
31
కీర్తన 31
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను;
నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి;
మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.
2మీరు నా వైపు చెవియొగ్గి,
నన్ను విడిపించడానికి త్వరగా రండి;
నా ఆశ్రయదుర్గమై,
బలమైన కోటవై నన్ను కాపాడండి.
3మీరు నా కొండ, నా కోట;
మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.
4నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి,
ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.
5మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.
యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.
6విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను;
నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.
7మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను,
నా బాధను మీరు చూశారు
నా వేదన మీకు తెలుసు.
8మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు
నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.
9యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి;
నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి,
నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.
10నా బ్రతుకు వేదనలో గడుస్తుంది
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది,
నా ఎముకల్లో సత్తువలేదు.
11నా శత్రువులందరి కారణంగా
పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు
నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు
వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు.
12చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు;
నేను పగిలిన కుండలా అయ్యాను.
13అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను,
“అన్నివైపులా భయమే!”
నామీద వారు దురాలోచన చేస్తున్నారు
నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
14కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను;
“మీరే నా దేవుడు” అని నేను చెప్తాను.
15నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది;
నన్ను వెంటాడే వారి నుండి,
నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.
16మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి;
మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి.
17యెహోవా, నేను మీకు మొరపెట్టాను,
నన్ను సిగ్గుపడనీయకండి;
అయితే దుష్టులు అవమానపరచబడాలి
వారు పాతాళంలో మౌనంగా ఉండాలి.
18అహంకారంతో ధిక్కారంతో
గర్వంతో నీతిమంతులను దూషించే వారి
అబద్ధపు పెదవులు మూయబడాలి.
19మీకు భయపడేవారి కోసం
మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది!
మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా,
మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!
20మనుష్యుల కుట్రలకు గురికాకుండ
మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు;
నిందించే నాలుకల నుండి తప్పించి
వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.
21యెహోవాకు స్తుతి, ఎందుకంటే
ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు
తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు.
22“మీ దృష్టి నుండి తొలగించబడ్డాను”
అని నేను ఆందోళన చెందాను.
సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు
నా విన్నపాన్ని విన్నారు.
23యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి.
యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు.
గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు.
24యెహోవాలో నిరీక్షించే ప్రజలారా!
నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 31: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.