యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది. పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
చదువండి కీర్తనలు 136
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: కీర్తనలు 136:1-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు