కీర్తనలు 119:105-176

కీర్తనలు 119:105-176 OTSA

మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను. యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి. నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను. దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు. మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం. అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం. మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి. భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను. మీ భయానికి నా శరీరం వణకుతుంది; మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి. మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి. మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి. నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే. ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను, నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము. మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను. మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి. మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి. యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను. నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం. మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి. కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది. ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను. అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి. మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు, ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు. యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను, నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను. నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు. నా నాలుక మీ మాటను పాడును గాక, ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి. మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక, ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను. యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను, మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది. నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి. నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను. మీ సేవకుడిని వెదకండి, నేను మీ ఆజ్ఞలను మరవలేదు.