కీర్తనలు 105
105
కీర్తన 105
1యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;
ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
2ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి;
ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
3ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి;
యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక
4యెహోవాను, ఆయన బలాన్ని చూడండి;
ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
5-6ఆయన సేవకులైన అబ్రాహాము సంతానమా,
ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానమా,
ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను,
ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
7ఆయన మన దేవుడైన యెహోవా;
ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.
8ఆయన తన నిబంధనను,
తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు,
9అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను,
ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.
10ఆయన దానిని యాకోబుకు శాసనంగా,
ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:
11“నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను
మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.”
12వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు,
ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,
13వారు దేశం నుండి దేశానికి,
ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
14ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు;
వారి కోసం ఆయన రాజులను మందలించారు:
15“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు;
నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
16ఆయన భూమిపై కరువును పిలిచారు
వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు;
17వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు,
ఒక బానిసగా అమ్మబడిన యోసేపును,
18-19తాను చెప్పింది జరిగే వరకు,
యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు,
వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు,
అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.
20రాజు కబురుపెట్టి, అతన్ని విడుదల చేశాడు,
జనాంగాల పాలకుడు అతన్ని విడిపించాడు.
21-22అతడు యోసేపును తన ఇంటి యజమానిగా,
తన స్వాస్థ్యమంతటి మీద పాలకునిగా చేశాడు,
తనకు నచ్చిన విధంగా తన యువరాజులకు సూచించడానికి
పెద్దలకు జ్ఞానాన్ని బోధించడానికి అధికారం ఇచ్చాడు.
23యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఆ తర్వాత హాము దేశమైన ఈజిప్టుకు వెళ్లి,
అక్కడే ప్రవాసం చేశాడు.
24యెహోవా తన ప్రజలకు అధిక సంతాన మిచ్చాడు;
వారిని శత్రువుల కన్నా బలవంతులుగా చేశారు.
25తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు,
తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు.
26ఆయన తన సేవకుడైన మోషేను
తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు.
27ఈజిప్టువారి మధ్య సూచక క్రియలు,
హాము దేశంలో అద్భుతాలు జరిగించారు.
28యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు;
వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.
29ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు,
వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు.
30వారి దేశం కప్పలతో నిండిపోయింది,
వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.
31ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి,
వారి దేశమంతటా దోమలు వచ్చాయి.
32దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ,
వడగండ్ల వాన కురిపించారు.
33ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు
వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు.
34ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు,
లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి.
35ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి,
భూమి పంటలను తినేశాయి.
36వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని
వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు.
37ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు.
ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు.
38వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది,
వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు.
39దేవుడు పరచిన మేఘపు దుప్పి వారిని కప్పింది,
రాత్రివేళ వెలుగు కోసం అగ్ని నిచ్చాడు దేవుడు.
40వారు కోరుకున్నట్లే దేవుడు పూరేడుపిట్టలను పంపించాడు.
ఆకాశం నుండి వచ్చే ఆహారంతో వారంతా తృప్తి చెందారు.
41దేవుడు బండను చీల్చాడు. అందులో నుండి నీరు ఉబికి బయటకు వచ్చింది.
ఆ మీరు నదీ ప్రవాహంలా ఎడారి స్థలాల్లో పారింది.
42ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన
పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
43తన ప్రజలను సంతోషంతో బయిటకి తెచ్చాడు.
తాను ఎన్నుకున్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు.
44ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు,
ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు.
45వారు ఆయన కట్టడలను అనుసరించాలని
ఆయన న్యాయవిధులను పాటించాలని.
యెహోవాను స్తుతించండి!#105:45 హెబ్రీలో హల్లెలూయా
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 105: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.