సంఖ్యా 25
25
మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీయుల వ్యభిచారం
1ఇశ్రాయేలు ప్రజలు షిత్తీములో ఉన్నప్పుడు వారు మోయాబు స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, 2వారు తమ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి వారిని ఆహ్వానించారు. ప్రజలు వాటికి అర్పించినవి తినడమే కాక, వారి దేవుళ్ళకు మొక్కారు. 3కాబట్టి ఇశ్రాయేలు బయల్-పెయోరును పూజించడంలో వారితో కలిసిపోయారు యెహోవా కోపం వారిపై రగులుకుంది.
4యెహోవా మోషేతో అన్నారు, “ఈ ప్రజల నాయకులందరిని తీసుకువచ్చి, యెహోవా ఎదుట వారిని చంపి, పట్టపగలే వారిని ప్రదర్శించు, తద్వారా యెహోవా కోపం ఇశ్రాయేలు మీద నుండి వెళ్లిపోతుంది.”
5కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులతో, “మీలో ప్రతి ఒక్కరు బయల్-పెయోరును పూజించిన వారితో కలిసిన ప్రతి పురుషుని చంపేయండి” అని అన్నాడు.
6అప్పుడే ఇశ్రాయేలీయులలో ఒకడు మిద్యాను స్త్రీని మోషే సమాజమందరి ఎదుట, ఆ శిక్షను బట్టి వారు సమావేశ గుడార ద్వారం దగ్గర ఏడుస్తున్న సమయంలో తీసుకువచ్చాడు. 7యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇది చూసినప్పుడు, సమాజాన్ని వదిలి, ఒక ఈటెను పట్టుకుని, 8ఆ ఇశ్రాయేలీయుని వెంట అతని గుడారంలోకి వెళ్లాడు. అతన్ని ఆ స్త్రీని కలిపి ఈటెతో పొడిచాడు, ఆ ఈటె అతని శరీరంలో నుండి ఆమె కడుపులోనికి దూసుకుపోయింది. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చిన తెగులు అంతరించింది; 9అయితే తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు.
10యెహోవా మోషేతో అన్నారు, 11“యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీయుల మీద ఉన్న నా కోపాన్ని తిప్పాడు. నాలాగే అతడు నా ఘనత కోసం వారి మధ్యలో రోషం కలిగి ఉన్నాడు కాబట్టి, నా రోషాన్ని బట్టి వారిని శిక్షించకుండ ఆపివేశాను. 12కాబట్టి నేను అతనితో సమాధాన ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పు. 13అతడు అతని సంతానం నిత్య యాజకత్వ నిబంధన కలిగి ఉంటారు ఎందుకంటే తన దేవుని ఘనత కోసం రోషం కలిగి, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.”
14మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు. 15చంపబడిన ఆ మిద్యానీయ స్త్రీ పేరు కొజ్బీ, ఈమె మిద్యానీయ కుటుంబాలలో ఒక గోత్ర నాయకుడైన సూరు కుమార్తె.
16యెహోవా మోషేతో అన్నారు. 17“మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి. 18వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించిన వారి సహోదరి, కొజ్బీ, మిద్యానీయుల నాయకుని కుమార్తె, పెయోరులో జరిగిన సంఘటన ఫలితంగా తెగులు వచ్చినప్పుడు చంపబడింది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 25: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.