సంఖ్యా 16

16
కోరహు, దాతాను, అబీరాముల తిరుగుబాటు
1లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి, 2మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు. 3వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు.
4మోషే ఇది విని సాగిలపడ్డాడు. 5తర్వాత కోరహుతో, అతని సహచరులందరితో ఇలా అన్నాడు: “రేపు ప్రొద్దున యెహోవా తన వారు ఎవరో పవిత్రులెవరో బయలుపరచి తన దగ్గరకు రానిస్తారు. తాను ఎన్నుకున్న మనిషిని ఆయన తన దగ్గరకు రానిస్తారు. 6కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి 7రేపు యెహోవా ఎదుట వాటిలో నిప్పు తెచ్చి ధూపం వేయండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటారో అతడు పవిత్రుడు. లేవీయులారా! మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు!”
8మోషే కోరహుతో మాట్లాడుతూ, “ఇప్పుడు వినండి లేవీయులారా! 9ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మిగిలిన ఇశ్రాయేలీయుల సమాజం నుండి వేరుచేసి, యెహోవా గుడారంలో పని చేయడానికి, సమాజం ముందు నిలబడి వారికి సేవ చేయడానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చినందుకు ఇది మీకు సరిపోదా? 10నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. 11యెహోవాకు విరోధంగా నీవు నీ పక్షంవారు గుమికూడారు. మీరు అహరోను మీద సణగడానికి అతనెవరు?”
12అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము! 13మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే భూమి నుండి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చారు, అది చాలదా? ఇప్పుడు నీవు మాపై ప్రభువుగా కూడా ఉండాలనుకుంటున్నావు! 14అంతేకాక, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాలేదు లేదా పొలాలు ద్రాక్షతోటల వారసత్వాన్ని మాకు ఇవ్వలేదు. మీరు ఈ మనుష్యులను బానిసలుగా#16:14 లేదా పురుషులను మోసం చేయాలని; హెబ్రీలో ఈ మనుష్యుల కళ్లు ఊడదీస్తావా? చూడాలనుకుంటున్నారా? మేము రాము!” అని అన్నారు.
15మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు.
16మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి. 17మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.” 18కాబట్టి ప్రతి ఒక్కరు తమ ధూపార్తిలో నిప్పువేసి దాని మీద ధూపం వేసి సమావేశ గుడార ద్వారం దగ్గర, మోషే అహరోనులతో నిలిచారు. 19కోరహు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తన పక్షం వారినందరిని సమావేశ గుడార ప్రవేశం దగ్గర పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనిపించింది. 20యెహోవా మోషే అహరోనులతో అన్నారు, 21“ఒక్కసారిగా నేను వారిని నాశనం చేయడానికి అనుకూలంగా ఉండేలా మీరు ఈ సమాజం నుండి వేరుగా నిలబడండి.”
22కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు.
23అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పారు. 24“సమాజంతో చెప్పు, ‘కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ”
25మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్లారు. 26అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.” 27కాబట్టి కోరహు, దాతాను, అబీరాములు డేరాల దగ్గర నుండి వారు కదిలి దూరంగా వెళ్లారు. దాతాను, అబీరాములు వారి భార్యాపిల్లలు చిన్న పిల్లలు తమ డేరాల ద్వారాలలో నిలబడి ఉన్నారు.
28అప్పుడు మోషే అన్నాడు, “యెహోవా ఇవన్నీ చేయడానికి నన్ను పంపించారని, నా అంతట నేనే ఏమీ చేయలేదని ఇలా మీరు తెలుసుకుంటారు: 29ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు. 30కానీ ఒకవేళ యెహోవా పూర్తిగా క్రొత్తదాన్ని తెస్తే, భూమి తన నోరు తెరిచి, వారికి సంబంధించిన ప్రతి దానితో పాటు వారిని మ్రింగివేసి, వారు సజీవంగా పాతాళంలోకి వెళ్తే, వీరు యెహోవాతో ధిక్కారంతో వ్యవహరించారని మీకు తెలుస్తుంది.”
31మోషే ఈ మాటలు చెప్పి ముగించిన వెంటనే వారి పాదాల క్రింద నేల చీలిపోయింది, 32భూమి నోరు తెరిచి, ఆ మనుష్యులను వారి ఇంటివారిని, కోరహు పక్షంగా ఉన్నవారందరిని, వారి ఆస్తితో సహా మ్రింగివేసింది. 33వారంతా వారికి చెందిన సమస్తంతో పాటు ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్లారు; భూమి వారిని కప్పేసింది. వారంతా సమాజంలో లేకుండా నాశనమయ్యారు. 34వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు.
35యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది.
36యెహోవా మోషేతో అన్నారు, 37“యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు, బూడిదలో నుండి ఆ ధూపార్తులను తీసివేసి నిప్పు కణాలను దూరంగా చెదరగొట్టమని చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైన ధూపార్తులు. 38పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.”
39కాబట్టి యాజకుడైన ఎలియాజరు కాల్చి చంపబడినవారు తీసుకువచ్చిన ఇత్తడి ధూపార్తులను సేకరించి, బలిపీఠం మీద కప్పి ఉండేలా వాటిని సుత్తెతో కొట్టించాడు, 40యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి.
41మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.
42మోషే అహరోనులకు వ్యతిరేకంగా సమాజం గుమికూడి, సమావేశ గుడారం వైపు చూశారు, అకస్మాత్తుగా మేఘం దానిని కప్పింది, యెహోవా మహిమ కనిపించింది. 43అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు. 44యెహోవా మోషేతో, 45“మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెంటనే వారిని చంపేస్తాను” అన్నారు. అప్పుడు వారు సాష్టాంగపడ్డారు.
46అప్పుడు మోషే అహరోనుతో, “నీ ధూపార్తిని తీసుకుని దానిలో ధూపం వేసి, బలిపీఠం నుండి మండుతున్న బొగ్గును తీసుకుని వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి సమాజం దగ్గరకు త్వరగా వెళ్లు. యెహోవా నుండి కోపం రగులుతూ వస్తుంది; తెగులు ప్రారంభమైంది” అన్నాడు. 47మోషే చెప్పినట్లే అహరోను చేశాడు. ధూపార్తులతో సమాజం మధ్యకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే ప్రజల్లో తెగులు మొదలయ్యింది కానీ అహరోను ధూపం వేసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. 48మృతులకు, జీవులకు మధ్య అతడు నిలిచాడు, తెగులు ఆగిపోయింది. 49అయితే, కోరహు తిరుగుబాటు వల్ల చనిపోయినవారు కాక తెగులు ద్వారా 14,700 మంది చనిపోయారు. 50తర్వాత తెగులు ఆగిపోయినందుకు అహరోను, సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరకు తిరిగి వచ్చాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 16: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి