నెహెమ్యా 5

5
పేదవారికి సహాయం చేసిన నెహెమ్యా
1తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. 2కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు.
3మరికొందరు, “కరువు సమయంలో ధాన్యం పొందడానికి మేము మా పొలాలను ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెడుతున్నాం” అన్నారు.
4ఇంకా కొందరు, “రాజుకు పన్ను చెల్లించడానికి మా పొలాలు ద్రాక్షతోటల మీద డబ్బు అప్పుగా తీసుకున్నాము. 5మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు.
6వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను. 7అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, 8“యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.
9నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా? 10నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము. 11ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను.
12అందుకు వారు, “మేము అన్ని తిరిగి ఇచ్చేస్తాము. వారి నుండి ఇక ఏమి ఆశించము. నీవు చెప్పినట్లే చేస్తాం” అన్నారు.
అప్పుడు నేను యాజకులను పిలిపించి వారు చేసిన వాగ్దానం ప్రకారం చేస్తామని చెప్పి సంస్థానాధిపతులతో, అధికారులతో ప్రమాణం చేయించాను. 13నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను.
అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు.
14నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు. 15నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ#5:15 అంటే, సుమారు 460 గ్రాములు వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు. 16నేను శ్రద్ధగా గోడ పని చేశాను. నా పనివారు అంతా కలిసి అదే పని చేశారు. మేము#5:16 కొ.ప్ర.లలో నేను భూమి సంపాదించుకోలేదు.
17అంతేకాక, నా భోజనపు బల్ల దగ్గర చుట్టుప్రక్కల దేశాలవారు కాకుండా నూటయాభైమంది యూదులు భోజనం చేసేవారు. 18ప్రతిరోజు ఒక ఎద్దు, ఆరు ఎంపిక చేసిన గొర్రెలు, కొన్ని కోళ్లు నా కోసం సిద్ధం చేసేవారు, పదిరోజులకు ఒకసారి అనేక రకాల ద్రాక్షరసాలను సమృద్ధిగా అందించేవారు. ఈ ప్రకారం చేసినా ప్రజల పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కాకుండా అధిపతికి ఇచ్చే ఆహారాన్ని నేను ఆశించలేదు.
19నా దేవా, ఈ ప్రజల కోసం నేను చేసినదంతా నన్ను దయతో గుర్తుంచుకోండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 5: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

నెహెమ్యా 5 కోసం వీడియో