మత్తయి సువార్త 6:5-14

మత్తయి సువార్త 6:5-14 OTSA

“మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి. “మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక. మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’ మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.