లూకా సువార్త 24

24
యేసు పునరుత్థానము
1వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. 2వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు, 3కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. 4వారు ఈ విషయాన్ని గురించి కలవరపడుతూ ఉండగా, మిలమిల మెరుస్తున్న వస్త్రాలను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి ఉండడం చూశారు 5స్త్రీలు భయంతో తమ ముఖాలను నేలకు వంచుకొన్నారు కానీ ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుతున్నారు? 6ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి, 7‘మనుష్యకుమారుడిని పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడని’ చెప్పాడు కదా!” అని అన్నారు. 8అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు.
9వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు. 10శిష్యులకు అపొస్తలులకు ఈ విషయాన్ని చెప్పింది వీరే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లియైన మరియ ఇంకా వారితో ఉన్న ఇతర స్త్రీలు. 11ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలుగా అనిపించాయి, కాబట్టి వారు నమ్మలేదు. 12అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తికొని పోయి, వంగి, నారబట్టలు మాత్రమే పడి ఉండడం చూసి, సమాధిలో ఏమి జరిగిందో అని ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు.
ఎమ్మాయి గ్రామమునకు వెళ్తున్న వారితో యేసు
13అదే రోజున ఇద్దరు శిష్యులు పదకొండు కిలోమీటర్ల#24:13 లేదా సుమారు 7 మైళ్ళు దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. 14వారు జరిగిన ఈ విషయాలన్నిటిని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. 15వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు; 16కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి.
17ఆయన వారిని, “మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి?” అని అడిగారు.
అందుకు వారు దిగులు ముఖాలతో నిలబడిపోయారు. 18వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీ ఒక్కడివేనా?” అని అడిగాడు.
19“ఏ విషయాలు?” అని ఆయన అడిగారు.
అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను కార్యాలలోను శక్తిగల ప్రవక్త. 20మన ముఖ్య యాజకులు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు; 21కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికీ మూడవ రోజు అవుతుంది. 22దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు, 23ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగివచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు. 24మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూశారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
25-26అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు. 27ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.
28ఇంతలో వారు వెళ్లవలసిన గ్రామం సమీపించారు, అయితే యేసు ఇంకా ముందుకు వెళ్తున్నట్లు వారికి అనిపించింది. 29అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కాబట్టి మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు.
30యేసు వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. 31అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు. 32అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.
33వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్లారు. అక్కడ పదకొండు మంది శిష్యులు వారితో ఉన్నవారందరు సమకూడి, 34వారు, “అది నిజమే! ప్రభువు నిజంగానే లేచి సీమోనుకు కనిపించారు” అని మాట్లాడుకుంటున్నారు. 35అప్పుడు ఆ ఇద్దరు దారిలో జరిగిన సంగతులను, యేసు రొట్టె విరిచేటప్పుడు ఆయనను ఎలా గుర్తించారో అని వారికి చెప్పారు.
యేసు శిష్యులకు కనబడుట
36వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు.
37తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. 38ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి? 39నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు.
40ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. 41అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు.
44తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు.
45అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు. 46ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, 47యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. 48ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు. 49నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు.
యేసు పరలోకానికి ఆరోహణమగుట
50ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. 51వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు. 52వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. 53వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లూకా సువార్త 24: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి