లూకా సువార్త 24:35-53

లూకా సువార్త 24:35-53 OTSA

అప్పుడు ఆ ఇద్దరు దారిలో జరిగిన సంగతులను, యేసు రొట్టె విరిచేటప్పుడు ఆయనను ఎలా గుర్తించారో అని వారికి చెప్పారు. వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు. తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు. ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి? నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు. ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు. తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు. అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు. ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు. ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు. వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.