లూకా సువార్త 1

1
పరిచయం
1-4ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన#1:1-4 లేదా ఖచ్చితంగా విశ్వసించబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది.
బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి ముందుగానే చెప్పబడుట
5యూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు. 6వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. 7అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.
8ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు, 9యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది. 10ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు.
11ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు. 12జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. 13ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. 14అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు. 15ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు. 16ఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. 17అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కోసం సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు.
18అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు.
19అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. 20నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు.
21అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. 22అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.
23అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. 24ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది. 25ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.
యేసు పుట్టుక గురించి ముందుగానే చెప్పబడుట
26ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, 27దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. 28ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.
29అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది. 30అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. 31నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. 32ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. 33ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.
34మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.
35అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.#1:35 లేదా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పిలువబడతాడు 36నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. 37ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు.
38అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.
మరియ ఎలీసబెతును దర్శిస్తుంది
39కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, 40అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. 41ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. 42ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు! 43నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? 44నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. 45ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.
మరియ గీతం
46అందుకు మరియ:
“నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.
47నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
48తన సేవకురాలి దీనస్థితిని
ఆయన గమనించారు.
ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,
49ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు,
పరిశుద్ధుడని ఆయనకు పేరు.
50తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి,
ఆయన కరుణ విస్తరిస్తుంది.
51ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు;
తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.
52సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు,
కాని, దీనులను పైకి లేవనెత్తారు.
53ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు,
కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
54-55ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి
నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ,
మన పితరులకు వాగ్దానం చేసినట్లు,
తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”
56మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.
బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక
57ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది. 58ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు.
59ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, 60తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది.
61అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.
62వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు. 63అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు. 64వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. 65ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు. 66ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది.
జెకర్యా గీతం
67తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:
68“ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక,
ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.
69-70దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు,
తన సేవకుడైన దావీదు వంశంలో
మన కోసం రక్షణ కొమ్మును#1:69-70 కొమ్మును ఇక్కడ బలమైన రాజును సూచిస్తుంది మొలిపించారు.
71మన శత్రువుల చేతి నుండి
మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,
72మన పితరులకు దయ చూపడానికి
తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:
73మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,
74మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి,
మనం భయపడకుండా ఆయనను సేవించాలని,
75బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట
పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.
76“నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు;
ప్రభువుకు ముందుగా నీవు ఆయన కోసం మార్గం సిద్ధం చేస్తావు.
77ఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే,
రక్షణ కలుగుతుందని వారికి తెలియ చేస్తావు,
78-79ఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి,
చీకటిలో జీవిస్తున్నవారిపై
మరణచ్ఛాయలో ఉన్నవారిపై ప్రకాశించడానికి
పరలోకం నుండి ఉదయించే సూర్యునిలా
మన దేవుని దయా కనికరం మన కోసం అనుగ్రహించబడింది.”
80ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లూకా సువార్త 1: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి