లేవీయ 19
19
వివిధ చట్టాలు
1యెహోవా మోషేతో అన్నారు, 2“నీవు ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను.
3“ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
4“ ‘విగ్రహాలవైపు తిరగకండి లేదా మీ కోసం అచ్చు వేసిన విగ్రహ దేవుళ్ళను చేసుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.
5“ ‘మీరు యెహోవాకు సమాధానబలి అర్పించినప్పుడు, అది మీ తరపున అంగీకరించబడే విధంగా దానిని అర్పించాలి. 6మీరు దానిని బలి అర్పించిన రోజున లేదా మరుసటిరోజున తినాలి; మూడవ రోజు వరకు ఏదైనా మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. 7ఒకవేళ దానిలో నుండి ఏదైనా మూడవ రోజున తిన్నట్లైతే, అది అపవిత్రమైనది, అది అంగీకరించబడదు. 8ఎవరైనా దానిని తింటే, యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేసినందుకు వారు దోషశిక్షను భరిస్తారు; వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.
9“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు. 10మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.
11“ ‘దొంగతనం చేయకూడదు.
“ ‘అబద్ధాలాడకూడదు.
“ ‘ఒకరిని ఒకరు మోసపుచ్చుకోకూడదు.
12“ ‘నా పేరిట అబద్ధ ప్రమాణాలు చేసి మీ దేవుని పేరు అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.
13“ ‘పొరుగువారిని పీడించకండి లేదా దోచుకోకండి.
“ ‘కూలివాళ్ళకు ఇవ్వాల్సిన కూలి మరుసటిరోజు ఉదయం వరకు మీ దగ్గర నిల్వ ఉంచుకోకూడదు.
14“ ‘చెవిటివారిని శపించవద్దు లేదా గ్రుడ్డివారి ముందు అడ్డు బండలు పెట్టవద్దు, కానీ మీ దేవునికి భయపడండి. నేను యెహోవాను.
15“ ‘తీర్పును వక్రీకరించకండి; బీదవారికి పక్షపాతం చూపకూడదు లేదా గొప్పవారిని అభిమానం చూపకూడదు, కాని మీ పొరుగువారికి న్యాయమైన తీర్పు తీర్చండి.
16“ ‘మీ ప్రజల్లో కొండేలు వ్యాపింపచేస్తూ తిరగకూడదు.
“ ‘మీ పొరుగువారి ప్రాణానికి అపాయం కలిగించేది ఏది చేయకూడదు. నేను యెహోవాను.
17“ ‘మీ తోటి ఇశ్రాయేలీయున్ని మీ హృదయంలో ద్వేషించకూడదు. మీ పొరుగువారి దోషం మీరు భరించకూడదు అంటే మీరు మీ పొరుగువారిని ఉన్నది ఉన్నట్లుగా గద్దించాలి.
18“ ‘ప్రతీకారం ప్రయత్నించవద్దు లేదా మీ ప్రజల్లో ఎవరి మీదా పగ పెట్టుకోవద్దు, కానీ మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి. నేను యెహోవానై ఉన్నాను.
19“ ‘నా శాసనాలు పాటించాలి.
“ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు.
“ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు.
“ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు.
20“ ‘ఒక దాసికి మరొక పురుషునితో నిశ్చితార్థం జరిగి, ఆమె కోసం విమోచన క్రయధనం చెల్లించబడక, ఆమెకు విడుదల కలుగక ముందే ఎవడైనా ఆమెతో పడుకున్నట్లైతే సరియైన శిక్ష#19:20 లేదా విచారణ జరగాలి ఉండాలి. అయితే ఆమె స్వతంత్రురాలు కాదు, కాబట్టి వారు చంపబడాల్సిన అవసరం లేదు. 21అయినాసరే, ఆ పురుషుడు సమావేశ గుడార ద్వారం దగ్గరకు ఒక పొట్టేలును తెచ్చి యెహోవాకు అపరాధపరిహారబలి అర్పించాలి. 22యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది.
23“ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా#19:23 హెబ్రీ సున్నతిలేనిది పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు. 24నాలుగవ సంవత్సరం దాని పండు పరిశుద్ధంగా, యెహోవాకు స్తుతి యాగంగా ఉంటాయి. 25అయితే అయిదవ సంవత్సరంలో మీరు దాని పండు తినవచ్చు. ఈ విధంగా మీ పంట అధికమవుతుంది. నేను మీ దేవుడనైన యెహోవాను.
26“ ‘ఏ మాంసమైన ఇంకా రక్తంతో ఉన్నప్పుడు తినకూడదు.
“ ‘భవిష్యవాణి పాటించవద్దు లేదా శకునాలు చూడవద్దు.
27“ ‘మీ తల ప్రక్క వెంట్రుకలు కత్తిరించవద్దు లేదా మీ గడ్డం చివరలు చిన్నవిగా చేయవద్దు.
28“ ‘చనిపోయినవారి కోసం మీ శరీరాలు గాయపరచుకోకూడదు లేదా మీ దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను.
29“ ‘మీ కుమార్తెను వేశ్యగా మార్చి ఆమెను దిగజార్చవద్దు, లేదా దేశం వ్యభిచారం వైపు తిరుగుతుంది, దుష్టత్వంతో నిండి ఉంటుంది.
30“ ‘నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
31“ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారి వైపు తిరగకండి లేదా ఆత్మలతో మాట్లాడేవారిని అనుసరించకండి, ఎందుకంటే మీరు వారి ద్వార అపవిత్రం అవుతారు. నేను మీ దేవుడనైన యెహోవాను.
32“ ‘వృద్ధులు ఉన్నప్పుడు వారి ముందు నిలబడండి, వృద్ధులను గౌరవించండి, మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నేను యెహోవాను.
33“ ‘విదేశీయులు మీ దేశంలో మీ మధ్య నివసించినప్పుడు, వారిని చులకనగా చూడవద్దు. 34మీ మధ్య నివసించే పరదేశిని మీ స్థానికంగా జన్మించిన వానిగా పరిగణించాలి. మీలాగే వారిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉండేవారు. నేను మీ దేవుడనైన యెహోవాను.
35“ ‘పొడవు, బరువు లేదా పరిమాణాన్ని కొలిచేటప్పుడు నిజాయితీ లేని ప్రమాణాలను ఉపయోగించవద్దు. 36న్యాయమైన త్రాసులు, న్యాయమైన తూనిక రాళ్లు, న్యాయమైన ఏఫా,#19:36 ధాన్యం కొలిచే పాత్ర, దాదాపు 22 లీటర్లు న్యాయమైన హిన్#19:36 హిన్ అనేది ద్రవాన్ని కొలిచే పాత్ర, దాదాపు 3.8 లీటర్లు ఉపయోగించండి. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను.
37“ ‘నా శాసనాలు, నా చట్టాలన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని పాటించండి. నేను యెహోవాను.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లేవీయ 19: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.