యెహోషువ 8

8
హాయి పతనం
1అప్పుడు యెహోవా యెహోషువతో, “భయపడకు; నిరుత్సాహపడకు. సైన్యమంతటిని నీతో తీసుకుని హాయి మీద దండెత్తు. నేను హాయి రాజును, అతని జనులను, పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతులకు అప్పగించాను. 2యెరికోకు దాని రాజుకు నీవు చేసిన విధంగా హాయికి దాని రాజుకు చేస్తావు, అయితే ఈసారి దానిలోని సొమ్మును, పశువులను మీ కోసం దోచుకోవచ్చు. పట్టణం వెనుక మాటు ఏర్పాటు చేయి” అని చెప్పారు.
3కాబట్టి యెహోషువ, సైనికులందరూ హాయిని ముట్టడించడానికి బయలుదేరారు. ముప్పైవేలమంది గొప్ప పరాక్రమవంతులను యెహోషువ ఎన్నుకుని రాత్రివేళ వారిని పంపిస్తూ, 4వారికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “శ్రద్ధగా వినండి. మీరు పట్టణం వెనుక మాటువేసి ఉండాలి. పట్టణానికి బాగా దూరంగా వెళ్లిపోకుండా మీరంతా సిద్ధంగా ఉండాలి. 5నేను, నాతో ఉన్నవారంతా పట్టణం దగ్గరకు వస్తాం, వారు ఇంతకు ముందులా మా మీదికి వచ్చినప్పుడు మేము వారి నుండి పారిపోతాము. 6‘వారు ఇంతకుముందులాగే మన నుండి పారిపోతున్నారు’ అని వారనుకుంటారు కాబట్టి మేము వారిని పట్టణం నుండి బయటకు తీసుకువచ్చే వరకు వారు మమ్మల్ని వెంటాడుతారు. మేము వారి నుండి పారిపోయినప్పుడు, 7మీరు మాటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని పట్టుకోండి. మీ దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తారు. 8మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి నిప్పు పెట్టండి. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేసి దానికి నిప్పు పెట్టండి. నేను మీకు ఇచ్చే ఆదేశాలు ఇవే.”
9యెహోషువ వారిని పంపించగా వారు వెళ్లి బేతేలుకు హాయికి మధ్య హాయి పడపటి వైపున మాటు వేశారు ఆ రాత్రి యెహోషువ ప్రజలమధ్య గడిపాడు.
10యెహోషువ మరుసటి ఉదయాన్నే తన సైన్యాన్ని సిద్ధపరచి, అతడు ఇశ్రాయేలీయుల పెద్దలు కలిసి వారి ముందు హాయి మీదికి వెళ్లారు. 11అతనితో ఉన్న బలగమంతా పట్టణానికి సమీపించి దాని ముందుకు చేరుకుంది. వారు హాయికి ఉత్తరాన, వారికి ఆ పట్టణానికి మధ్య లోయ ఉన్నచోట శిబిరం ఏర్పరచుకున్నారు. 12యెహోషువ దాదాపు అయిదువేల మందిని తీసుకుని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య మాటు వేశాడు. 13కాబట్టి సైనికులు పట్టణానికి ఉత్తరాన ప్రధాన శిబిరాన్ని, పట్టణానికి పడమర మాటు వేయడానికి తమ స్థానాలను ఏర్పరచుకున్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోకి వెళ్లాడు.
14హాయి రాజు ఇది చూసినప్పుడు, అతడు, పట్టణపు ప్రజలందరూ ఉదయాన్నే త్వరగా లేచి అరాబాకు ఎదురుగా ఉన్న ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇశ్రాయేలును యుద్ధంలో ఎదుర్కోడానికి బయలుదేరారు. అయితే పట్టణం వెనుక తనను పట్టుకోడానికి మాటువేసి ఉంటారని అతనికి తెలియలేదు. 15యెహోషువ, ఇశ్రాయేలీయులందరు వారి ముందు నిలబడలేక అరణ్యానికి పారిపోయారు. 16వారిని తరమడానికి హాయిలోని ప్రజలందరూ కలిసి యెహోషువను వెంటాడుతున్నామనే భ్రమలో పట్టణం నుండి దూరంగా వచ్చేశారు. 17ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు.
18అప్పుడు యెహోవా యెహోషువతో, “నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు పట్టుకో, నీ చేతికి నేను పట్టణాన్ని అప్పగిస్తాను” అని చెప్పారు. కాబట్టి యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను పట్టణం వైపు చాపాడు. 19యెహోషువ తన చేయి చాపిన వెంటనే మాటున ఉన్నవారు త్వరత్వరగా తమ స్థలాల నుండి బయటకు పరిగెత్తి వచ్చి పట్టణంలో జొరబడి దానిని స్వాధీనం చేసుకుని, వెంటనే దానికి నిప్పంటించారు.
20హాయి మనుష్యులు వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి లేవడం చూశారు, అయితే వారు తప్పించుకోవడానికి ఏ వైపు నుండి కూడా అవకాశం లేదు; అరణ్యం వైపు పారిపోతున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమను వెంటాడుతున్న వారిమీదికి దాడికి దిగారు. 21మాటున పొంచిన వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం పట్టణం నుండి పొగ పైకి లేవడం యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలంతా చూసి, వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద దాడి చేశారు. 22ఈ లోపు పట్టణం బయట మాటు వేసినవారు కూడా వారితో పోరాడటానికి బయలుదేరి వచ్చారు. కొంతమంది ఇటువైపు, మరికొంతమంది అటువైపు ఉండడంతో ఇశ్రాయేలీయుల మధ్యలో హాయి వారు చిక్కుకున్నారు. కాబట్టి వారిలో ఎవ్వరూ బ్రతికి బయటపడకుండ అందరిని హతమార్చారు. 23కాని హాయి రాజును మాత్రం వారు ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరకు తీసుకువచ్చారు.
24పొలాల్లో, అరణ్యంలో హాయి మనుష్యులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపటం పూర్తి చేసిన తర్వాత, వారిలో ఎవరూ మిగలకుండా ప్రతి ఒక్కరు ఖడ్గం పాలయ్యాక, ఇశ్రాయేలీయులంతా హాయికి తిరిగివచ్చి దానిలో ఉన్నవారందరిని చంపివేశారు. 25ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు. 26ఎందుకంటే హాయిలో నివసించే వారందరినీ నాశనం చేసే వరకు యెహోషువ తన ఈటెను పట్టుకున్న చేతిని వెనుకకు తీసుకోలేదు. 27అయితే యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు ఈ పట్టణంలోని పశువులను, దోపుడుసొమ్మును తమ కోసం తీసుకెళ్లారు.
28కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది. 29అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.
ఏబాలు పర్వతం దగ్గర ఒడంబడిక పునరుద్ధరణ
30-31యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు, యెహోషువ ఏబాలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాని ప్రకారం అతడు చెక్కని రాళ్లతో ఎటువంటి ఇనుప సాధనం వాడకుండ దాన్ని కట్టాడు. దానిపై వారు యెహోవాకు దహనబలులు సమాధానబలులు అర్పించారు. 32ఇశ్రాయేలీయుల సమక్షంలో, యెహోషువ మోషే ధర్మశాస్త్ర ప్రతిని రాళ్లపై వ్రాశాడు. 33ఇశ్రాయేలీయులందరు, వారి పెద్దలు, అధికారులు, న్యాయాధిపతులతో పాటు యెహోవా నిబంధన మందసానికి ఇరువైపులా, దానిని మోస్తున్న లేవీయ యాజకులకు ఎదురుగా నిలబడ్డారు. వారి మధ్య నివసిస్తున్న విదేశీయులు, స్థానికంగా పుట్టినవారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవా సేవకుడైన మోషే గతంలో సూచనలు ఇచ్చినప్పుడు ఆజ్ఞాపించినట్లుగా వారిలో సగం మంది ప్రజలు గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడ్డారు.
34ఆ తర్వాత, యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని అనగా దీవెనలను శాపాలను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే చదివాడు. 35స్త్రీలు, పిల్లలు, వారి మధ్య నివసించే విదేశీయులతో సహా ఇశ్రాయేలీయుల సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించిన వాటిలో యెహోషువ చదవకుండా ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 8: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి