యెహోషువ 17

17
1యోసేపు మొదటి సంతానంగా మనష్షే గోత్రానికి కేటాయించబడిన భాగం ఇదే. మనష్షే మొదటి కుమారుడు, గిలాదీయుల పూర్వికుడైన మాకీరుకు గిలాదు, బాషానులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే మాకీరీయులు గొప్ప సైనికులు. 2కాబట్టి ఈ కేటాయింపు మనష్షే వారిలో మిగిలిన ప్రజలైన అబీయెజెరు, హెలెకు, అశ్రీయేలు, షెకెము, హెఫెరు, షెమీదా వారికి ఇవ్వబడింది. వీరు తమ వంశాల ప్రకారం యోసేపు కుమారుడైన మనష్షే మగ సంతానము.
3మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారుడైన హెఫెరుకు పుట్టిన సెలోఫెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. 4వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, నాయకుల దగ్గరకు వెళ్లి, “మా బంధువుల మధ్య మాకు వారసత్వం ఇవ్వాలని మోషేకు యెహోవా ఆజ్ఞాపించారు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ యెహోవా ఆజ్ఞ ప్రకారం వారి తండ్రి సోదరుల మధ్య వారికి వారసత్వమిచ్చాడు. 5యొర్దాను నదికి అవతల ఉన్న గిలాదు, బాషానుతో పాటు మనష్షేకు అధనంగా పది వాటాల భూమి వచ్చింది. 6ఎందుకంటే మనష్షే గోత్రపు కుమారులతో పాటు వారి కుమార్తెలు కూడా వారసత్వాన్ని పొందారు. గిలాదు దేశం మిగతా మనష్షే సంతతివారికి ఇవ్వబడింది.
7మనష్షే భూభాగం ఆషేరు నుండి షెకెముకు తూర్పున ఉన్న మిక్మెతాతు వరకు దక్షిణాన ఎన్-తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది. 8(తప్పూయ భూభాగం మనష్షేకు చెందుతుంది, కానీ మనష్షే సరిహద్దులో ఉన్న తప్పూయ ఎఫ్రాయిమీయులకు చెందినదే.) 9ఆ సరిహద్దు దక్షిణాన కానా కనుమ వరకు కొనసాగింది. మనష్షే పట్టణాల మధ్య ఎఫ్రాయిముకు చెందిన పట్టణాలు ఉన్నాయి, కానీ మనష్షే సరిహద్దు కనుమకు ఉత్తరం వైపుగా మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. 10దక్షిణాన ఉన్న భూమి ఎఫ్రాయిముకు, ఉత్తరాన మనష్షేకు చెందినది. మనష్షే భూభాగం మధ్యధరా సముద్రం వరకు ఉంది. ఉత్తరాన ఆషేరు, తూర్పున ఇశ్శాఖారు సరిహద్దులుగా ఉంది.
11ఇశ్శాఖారు, ఆషేరులలో మనష్షేకు బేత్-షాను, ఇబ్లెయాము, దోరు, ఎన్-దోరు, తానాకు, మెగిద్దో ప్రజలు, వారి చుట్టూ ఉన్న స్థావరాలు కూడా ఉన్నాయి (జాబితాలో మూడవది నఫోతా#17:11 అంటే దోరు).
12కనానీయులు ఆ ప్రాంతంలో నివసించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి మనష్షే సంతతివారు ఈ పట్టణాలను ఆక్రమించలేకపోయారు. 13తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా బలం పుంజుకున్నప్పుడు కనాను వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు గాని, వారిని పూర్తిగా వెళ్లగొట్టలేదు.
14యోసేపు వంశపు వారు యెహోషువతో, “మీరు మాకు ఒక్క వాటా ఒక్క భాగం మాత్రమే వారసత్వంగా ఇచ్చారేంటి? మేము చాలామందిమి, యెహోవా మమ్మల్ని విస్తారంగా దీవించారు” అన్నారు.
15యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు.
16అందుకు యోసేపు సంతతివారు, “ఈ కొండసీమ మాకు సరిపోదు. మైదాన ప్రాంతంలో అంటే బేత్-షానులో దాని చుట్టూ ఉన్న స్థావరాలలో యెజ్రెయేలు లోయలో ఉంటున్న కనానీయులందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు.
17యెహోషువ యోసేపు గోత్రాలతో అనగా ఎఫ్రాయిం మనష్షేలతో, “మీరు చాలామంది ఉన్నారు, మీరు చాలా బలవంతులు. మీకు ఒక్క భాగమే కాదు, 18అడవులతో ఉన్న ఆ కొండ మీదే. కాబట్టి దానిని నరకండి; అప్పుడు ఆ ప్రదేశం మీది అవుతుంది. కనానీయులకు ఇనుప రథాలు ఉన్నా వారు బలవంతులైనా మీరు వారిని వెళ్లగొట్టగలరు” అన్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 17: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి