యోహాను సువార్త 14:1-27

యోహాను సువార్త 14:1-27 OTSA

“మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి. నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా? నేను వెళ్లి మీ కోసం నివాస స్థలాన్ని సిద్ధపరచి, మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు. తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు. అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు. మీరు నన్ను నిజంగా తెలుసుకుని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటినుండి ఆయన మీకు తెలుసు, మీరు ఆయనను చూశారు” అన్నారు. అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, మాకది చాలు” అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాంటప్పుడు ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు? నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో మాట్లాడే మాటలు నా స్వంత మాటలు కావు, నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే మాట్లాడుతున్నాడు. నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పితే నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్భుత కార్యాలను చూసి నమ్మండి. నన్ను నమ్మేవారు నేను చేస్తున్న క్రియలు చేయడమే కాదు, వీటికన్నా గొప్ప వాటిని చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను. మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను. “మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు. మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను. ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు. నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను. కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని మీరు ఆ రోజు గుర్తిస్తారు. నా ఆజ్ఞలను పాటించేవారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నారు. యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనుపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు. అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము. నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు. “నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను. కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.