మరునాడు పండుగకు వచ్చిన గొప్ప జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నారని విని, ఖర్జూరపు మట్టలు తీసుకుని, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!” అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు. యేసు ఒక గాడిద పిల్లను చూసి దానిపై కూర్చున్నారు. ఎందుకంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “సీయోను కుమారీ, భయపడకు! ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని నీ రాజు వస్తున్నాడు.” మొదట ఆయన శిష్యులు ఈ సంగతులను గ్రహించలేదు. కాని యేసు మహిమ పరచబడిన తర్వాత మాత్రమే ఈ సంగతులన్ని ఆయన గురించే వ్రాయబడ్డాయని, అందుకే అవన్నీ ఆయనకు జరిగాయని జ్ఞాపకం చేసుకున్నారు. యేసు సమాధిలో నుండి పిలిచి లాజరును మళ్ళీ బ్రతికించిన యేసుతో పాటు ఉన్న ప్రజలందరు ఆ విషయాన్ని ఇతరులకు చెప్తూనే ఉన్నారు. ఆయన ఈ అద్భుత కార్యాన్ని చేశారని విన్న జనసమూహం ఆయనను కలుసుకోడానికి వస్తూనే ఉన్నారు. దీని గురించి పరిసయ్యులు, “చూడండి, లోకమంతా ఆయన వెనుక ఎలా వెళ్తుందో! అయినా మనమేమి చేయలేకపోతున్నాం!” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరు గ్రీసుదేశస్థులున్నారు. వారు గలిలయలోని బేత్సయిదా గ్రామానికి చెందిన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అని అన్నారు. ఫిలిప్పు వెళ్లి ఆ విషయం అంద్రెయతో చెప్పాడు. ఫిలిప్పు అంద్రెయ కలిసి వెళ్లి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది. నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకుంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కోసం కాపాడుకుంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు. “ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది, నేనేం చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియ నుండి నన్ను తప్పించవా?’ కానీ దీని కోసమే కదా నేను ఈ గడియకు చేరుకున్నాను. తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దాన్ని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న జనసమూహం అది విని, ఇప్పుడు ఉరిమింది కదా అన్నారు. మిగిలిన వారు, “ఒక దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు. అప్పుడు యేసు, “ఆ స్వరం నా కోసం రాలేదు అది మీ కోసమే వచ్చింది. ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం. నేను భూమిమీది నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను” అని అన్నారు. ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.
చదువండి యోహాను సువార్త 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను సువార్త 12:12-33
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు