యిర్మీయా 35

35
రేకాబీయులు
1యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలనలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది: 2“రేకాబీయుల కుటుంబం దగ్గరకు వెళ్లి, వారిని యెహోవా మందిరంలోని ప్రక్క గదుల్లో ఒక దానిలోకి రమ్మని ఆహ్వానించి, త్రాగడానికి వారికి ద్రాక్షరసం ఇవ్వు.”
3కాబట్టి నేను హబజ్జిన్యా మనుమడును యిర్మీయా కుమారుడునైన యాజన్యాను అతని సోదరులను అతని కుమారులందరిని అంటే రేకాబీయుల కుటుంబమంతటిని తీసుకురావడానికి వెళ్లాను. 4నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది. 5అప్పుడు నేను ద్రాక్షరసంతో నిండిన పాత్రలను, కొన్ని గిన్నెలను రేకాబీయుల ముందు ఉంచి, “కొంచెం ద్రాక్షరసం త్రాగండి” అని వారితో చెప్పాను.
6అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు,#35:6 హెబ్రీలో యోనాదాబు యెహోనాదాబు యొక్క మరో రూపం; ఇక్కడ, ఈ అధ్యాయంలో తరచుగా కనబడుతుంది ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు. 7అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు. 8మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన ప్రతిదానికీ మేము లోబడి ఉన్నాము. మేము గాని మా భార్యలు గాని మా కుమారులు, కుమార్తెలు గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగలేదు. 9నివసించడానికి ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్షతోటలు గాని, పొలాలు గాని పంటలు గాని మాకు లేవు. 10మేము గుడారాల్లో నివసించాము, మా పూర్వికుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని పూర్తిగా పాటించాము. 11అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేము, ‘రండి, మనం బబులోను, సిరియనుల సైన్యాల నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు వెళ్దాం’ అని చెప్పుకున్నాము. కాబట్టి మేము యెరూషలేములో ఉండిపోయాం” అని చెప్పారు.
12అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది: 13“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీరు వెళ్లి యూదా ప్రజలకు, యెరూషలేములో నివసిస్తున్న వారికి ఇలా చెప్పండి, ‘మీరు గుణపాఠం నేర్చుకుని నా మాటలకు లోబడరా?’ అని యెహోవా అడుగుతున్నారు. 14‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు. 15నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు. 16రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివారు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు, కానీ ఈ ప్రజలు నా మాటకు లోబడలేదు.’
17“కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ”
18అప్పుడు యిర్మీయా రేకాబీయులతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు మీ పూర్వికుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డారు, అలాగే అతని ఆదేశాలన్నిటిని అనుసరించి అతడు ఆదేశించిన ప్రతిదీ మీరు చేశారు.’ 19కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నన్ను సేవించడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతానంలో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 35: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యిర్మీయా 35 కోసం వీడియో