యిర్మీయా 2:1-13

యిర్మీయా 2:1-13 OTSA

యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు. ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు. యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి. యెహోవా ఇలా చెప్తున్నారు: “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, వారికి నాలో ఏం తప్పు కనిపించింది? వారు విలువలేని విగ్రహాలను పూజించి, వారు విలువలేని వారయ్యారు. వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు. నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు. యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు. “కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను” మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను, “అని యెహోవా ప్రకటిస్తున్నారు. కుప్ర తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి, కేదారుకు దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి; ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి: ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు. ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు. “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.