న్యాయాధిపతులు 6

6
గిద్యోను
1ఇశ్రాయేలీయులు యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించారు. 2మిద్యానీయులు తమను చాలా క్రూరంగా అణచివేయడంతో ఇశ్రాయేలీయులు తమ కోసం పర్వతాల్లో, గుహల్లో, బలమైన కోటలలో సురక్షితమైన స్థలాలు సిద్ధపరచుకున్నారు. 3ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు. 4వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు. 5వారు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వచ్చారు. వారిని, వారి ఒంటెలును లెక్కించడం అసాధ్యం; భూమిని నాశనం చేయడానికి దానిని ఆక్రమించుకున్నారు. 6మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు.
7మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు, 8ఆయన వారి కోసం ఒక ప్రవక్తను పంపారు. అతడు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను. 9ఈజిప్టువారి చేతి నుండి మిమ్మల్ని రక్షించాను. మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుండి విడిపించాను; మీ ఎదుట నుండి వారిని తరిమేసి వారి దేశాన్ని మీకిచ్చాను. 10నేను మీతో, ‘మీ దేవుడనైన యెహోవాను నేనే; మీరు నివసించే అమోరీయుల దేశంలో వారి దేవుళ్ళకు భయపడకూడదు’ అని చెప్పాను కాని మీరు నా మాట వినలేదు.”
11యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. 12యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు.
13అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు.
14అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?”
15గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.”
16యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు.
17అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి. 18నేను తిరగి వచ్చి, నా అర్పణ తెచ్చి, మీ ముందు పెట్టే వరకు మీరు వెళ్లకండి.”
అందుకు యెహోవా అన్నారు, “నీవు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటాను.”
19గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు#6:19 అంటే, దాదాపు 16 కి. గ్రా. లు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు.
20దేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులియని రొట్టెలను తీసుకుని ఈ రాతి మీద పెట్టి, ఆ రసం దాని మీద పోయి” అన్నాడు. గిద్యోను అలాగే చేశాడు. 21అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. 22వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు.
23అయితే యెహోవా అతనితో, “నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు” అన్నారు.
24కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త#6:24 అంటే, యెహోవా షాలోం అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
25ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని#6:25 అంటే, అషేరా దేవత యొక్క కర్ర చిహ్నాలు విరగ్గొట్టు. 26తర్వాత ఈ దుర్గం పైన సరియైన విధంగా నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు. నీవు విరగ్గొట్టిన అషేరా స్తంభం కర్రను వాడుతూ ఆ రెండవ కోడెను దహనబలిగా అర్పించు.”
27కాబట్టి గిద్యోను తన సేవకులలో పదిమందిని తీసుకెళ్లి యెహోవా తనతో చెప్పింది చేశాడు. కాని తన కుటుంబానికి, నగర ప్రజలకు భయపడి పగటి వేళలో కాకుండా రాత్రి వేళలో చేశాడు.
28ఉదయం ఆ నగర ప్రజలు లేచినప్పుడు పడిపోయిన బయలు బలిపీఠం, దాని ప్రక్కన విరిగిపోయిన అషేరా స్తంభం, క్రొత్తగా కట్టబడిన బలిపీఠం మీద రెండవ కోడె అర్పించబడి ఉండడం చూశారు.
29వారు, “ఎవరు ఇది చేశారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
వారు జాగ్రతగా విచారణ చేసినప్పుడు, “యోవాషు కుమారుడైన గిద్యోను దానిని చేశాడు” అని వారికి తెలిసింది.
30నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుడు బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని పడద్రోసాడు కాబట్టి అతడు చావాలి. అతన్ని బయటకు తీసుకురా” అన్నారు.
31యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు. 32గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఆ రోజున అతనికి యెరుబ్-బయలు#6:32 యెరుబ్-బయలు బహుశ దీని అర్థం బయలు వాదించుకోని అని పేరు పెట్టి, “బయలును అతనితో వాదించుకోని” అని అన్నారు.
33మిద్యానీయులందరు, అమాలేకీయులందరు, ఇతర తూర్పున ఉన్న ప్రజలందరూ కలిసివచ్చి యొర్దాను దాటి యెజ్రెయేలు లోయలో బస చేశారు. 34అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదికి రాగా, అతడు బూర ఊది అబీయెజెరు వంశస్థులను తనను వెంబడించుమని పిలుపునిచ్చాడు. 35అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.
36గిద్యోను దేవునితో, “మీరు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలును రక్షించాలనుకుంటే, 37చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు. 38అలాగే జరిగింది. గిద్యోను మరుసటిరోజు ప్రొద్దున లేచి ఆ బొచ్చు మీద ఉన్న మంచును పిండినప్పుడు ఓ పాత్ర నిండా నీళ్లు వచ్చాయి.
39అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప్పడకండి, ఇంకొక్కటే అడుగుతాను. గొర్రెబొచ్చుతో ఇంకొక పరీక్షకు నన్ను అనుమతించండి. అయితే ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా మంచు పడాలి” అన్నాడు. 40ఆ రాత్రి దేవుడు అలానే చేశారు. నేలంతా మంచు పడింది కాని బొచ్చు పొడిగా ఉంది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 6: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

న్యాయాధిపతులు 6 కోసం వీడియో