న్యాయాధిపతులు 12
12
యెఫ్తా, ఎఫ్రాయిం
1ఎఫ్రాయిం ప్రజలు సమకూడి సఫోనును దాటి వెళ్లి యెఫ్తాతో, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మమ్మల్ని పిలువకుండా నీవెందుకు వెళ్లావు? ఇప్పుడు నీవుంటున్న నీ ఇంటిని నీతో పాటు కాల్చివేస్తాము.”
2యెఫ్తా జవాబిస్తూ, “నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద తగాదా వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వారి చేతి నుండి నన్ను కాపాడలేదు. 3మీరు సహాయం చేయరని తెలుసుకొని, నేను నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాను. యెహోవా వారి మీద నాకు జయం ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు నాతో పోట్లాడడానికి ఈ రోజు వచ్చారు?” అని అన్నాడు.
4యెఫ్తా గిలాదు మనుష్యులను కూర్చుకుని ఎఫ్రాయిం వారితో యుద్ధం చేశాడు. ఎఫ్రాయిమీయులను, “గిలాదీయులైన మీరు ఎఫ్రాయిం మనష్షేల ఎదుట నిలబడలేక పారిపోయారు” అని అన్నారు. 5కాబట్టి గిలాదీయులు ఎఫ్రాయిం ఎదురుగా ఉన్న యొర్దాను రేవును ఆక్రమించారు, ఎఫ్రాయిం వారిలో పారిపోతున్న వారెవరైనా వచ్చి, “నన్ను దాటి వెళ్లనివ్వండి” అని అంటే, గిలాదు మనుష్యులు, “నీవు ఎఫ్రాయిం వాడవా?” అని అడిగేవారు. అతడు, “కాదు” అని అంటే, 6వారు, “సరే, ‘షిబ్బోలెత్’ అని పలుకు” అనేవారు. అతడు, ఆ పదం సరిగా పలుకలేక, “సిబ్బోలెతు” అని పలికితే, వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవు దగ్గర చంపేవారు. ఆ కాలంలో నలభై రెండువేలమంది ఎఫ్రాయిమీయులు చంపబడ్డారు.
7యెఫ్తా ఆరేళ్ళు ఇశ్రాయేలును నడిపించాడు. తర్వాత గిలాదీయుడైన యెఫ్తా చనిపోయాడు, గిలాదులో ఒక పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
ఇబ్సాను, ఏలోను, అబ్దోను
8యెఫ్తా తర్వాత, బేత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలును నడిపించాడు. 9అతనికి ముప్పైమంది కుమారులు, ముప్పైమంది కుమార్తెలు ఉన్నారు. అతడు తన కుమార్తెలను వేరే గోత్రం వారికి ఇచ్చి పెళ్ళి చేశాడు, అలాగే తన కుమారులకు తన గోత్రానికి చెందని ముప్పైమంది యువతులతో పెళ్ళిళ్ళు చేశాడు. ఇబ్సాను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. 10తర్వాత ఇబ్సాను చనిపోయాడు, బేత్లెహేములో పాతిపెట్టబడ్డాడు.
11అతని తర్వాత, జెబూలూను వాడైన ఎలోను ఇశ్రాయేలును పది సంవత్సరాలు నడిపించాడు. 12తర్వాత ఎలోను చనిపోయాడు, జెబూలూను ప్రదేశంలో అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు.
13అతని తర్వాత, పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలును నడిపించాడు. 14అతనికి నలభైమంది కుమారులు, ముప్పైమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్బై గాడిదల మీద స్వారీ చేసేవారు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. 15తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను చనిపోయాడు. అమాలేకీయుల కొండసీమలో ఉన్న ఎఫ్రాయిం ప్రదేశంలోని పిరాతోనులో అతడు పాతిపెట్టబడ్డాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 12: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.