యాకోబు పత్రిక 1:19-26

యాకోబు పత్రిక 1:19-26 OTSA

నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు; ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది. మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు; వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు. అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు. తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.