యెషయా 58
58
నిజమైన ఉపవాసం
1“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి.
బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి.
నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి,
యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.
2ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు;
తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా
నీతిని అనుసరించే దేశంగా
నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు.
తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు,
దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.
3వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా
మీరెందుకు చూడరు?
మమ్మల్ని మేము తగ్గించుకుంటే
మీరెందుకు గమనించరు?’
“అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు
మీ పనివారినందరిని దోచుకున్నారు.
4మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో,
ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది.
మీ స్వరం పరలోకంలో వినపడాలని
మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.
5ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది?
మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా?
ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని
గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా?
యెహోవాకు ఇష్టమైన ఉపవాసం
ఇదేనని మీరనుకుంటున్నారా?
6“నేను కోరుకునే ఉపవాసం
అన్యాయపు సంకెళ్ళను విప్పడం,
బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం,
బాధించబడిన వారిని విడిపించడం,
ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?
7మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం,
ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం,
మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం,
మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?
8అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది.
మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది;
అప్పుడు మీ నీతి#58:8 లేదా మీ నీతిమంతుడు మీ ముందుగా నడుస్తుంది
యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.
9అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు;
మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు.
“మీరు ఇతరులను బాధించడం,
వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,
10ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి,
బాధించబడినవారి అవసరాలను తీరిస్తే,
చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది,
మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.
11యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు;
కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి
మీ ఎముకలను బలపరుస్తారు.
మీరు నీరు పెట్టిన తోటలా
ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.
12పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు.
అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు;
మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా,
నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.
13“నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా
నా సబ్బాతును పాటిస్తే,
సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని
యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే,
దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా,
మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,
14అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు,
దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను,
మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.”
యెహోవా తెలియజేసిన మాట ఇదే.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 58: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.