యెషయా 30
30
మూర్ఖపు పట్టుగల దేశానికి శ్రమ
1యెహోవా ఇలా అంటున్నారు,
“మూర్ఖులైన పిల్లలకు శ్రమ,
వారు నావి కాని ఆలోచనలు చేస్తారు,
నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ
పాపానికి పాపం జత చేస్తున్నారు;
2వారు నన్ను సంప్రదించకుండా
ఈజిప్టుకు వెళ్తారు;
వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు,
ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.
3కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది,
ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.
4వారి అధిపతులు సోయనులో ఉన్నా,
వారి రాయబారులు హనేసు చేరుకున్నా
5వారికి సహాయకరంగా ఉపయోగకరంగా
ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే
ప్రజల కారణంగా
వారందరు సిగ్గుపరచబడతారు.”
6దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం:
సింహాలు ఆడ సింహాలు,
నాగుపాములు ఎగిరే సర్పాలు,
కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు,
గాడిదల వీపుల మీద తమ ఆస్తిని
ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని
తమకు లాభం కలిగించని ఆ దేశానికి,
7సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు.
కాబట్టి నేను దానిని
ఏమి చేయని రాహాబు#30:7 పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు. అని పిలుస్తాను.
8ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన
సాక్షంగా ఉండేలా
వారి కోసం పలక మీద దీనిని వ్రాయి
వీటిని గ్రంథస్తం చేయి.
9ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు,
యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు.
10వారు దీర్ఘదర్శులతో,
“ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు.
అలాగే ప్రవక్తలతో,
“సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు.
మాకు అనుకూలమైన విషయాలు
భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.
11మా దారిని వదలండి,
ఈ మార్గం నుండి తొలగిపోండి.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ
మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!”
12కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే:
“మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు,
బాధించడాన్ని నమ్ముకుని,
మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,
13ఈ పాపం మీకు బీటలు తీసి
ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది,
అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.
14అది మట్టికుండలా పగిలిపోతుంది,
కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది,
పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని
కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని
దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.”
15ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది,
ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది
కానీ మీకు ఇవేవి లభించవు.
16మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు.
కాబట్టి మీరు పారిపోతారు!
మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు.
కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!
17పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా
కొండమీద ఉన్న జెండాలా
మీరు మిగిలేవరకు
ఒకరు గద్దించగా
మీలో వెయ్యిమంది పారిపోతారు;
అయిదుగురు గద్దించగా
మీరందరు పారిపోతారు.”
18అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు;
కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
యెహోవా న్యాయం తీర్చే దేవుడు
ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!
19యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు. 20ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు. 21మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు. 22అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.
23మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి. 24భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి. 25గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి. 26యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.
27చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో
యెహోవా నామం దూరం నుండి వస్తుంది;
ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి.
ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.
28ఆయన ఊపిరి మెడ లోతు వరకు
ప్రవహించే ధారలా ఉంది.
ఆయన నాశనమనే జల్లెడలో దేశాలను గాలిస్తారు;
దారి తప్పించే కళ్లెమును
ప్రజల దవడలలో ఆయన అమర్చుతారు.
29రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా
మీరు పాడతారు
ఇశ్రాయేలుకు ఆశ్రయ కోటయైన
యెహోవా పర్వతానికి
పిల్లనగ్రోవి వాయిస్తూ వెళ్లే వారిలా
మీ హృదయాలు సంతోషిస్తాయి.
30యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు,
భయంకరమైన కోపంతో దహించే అగ్నితో
మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో
తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు.
31యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది;
తన దండంతో ఆయన వారిని మొత్తుతారు.
32యెహోవా తన శిక్షించే దండంతో
అష్షూరు మీద వేసే ప్రతి దెబ్బ
తంబుర సితారాల సంగీతంతో కలిసి ఉంటుంది.
ఆయన తన చేయి ఆడించి యుద్ధం చేస్తారు.
33చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం#30:33 అంటే, తోఫెతు సిద్ధపరచబడింది;
అది రాజు కోసం సిద్ధపరచబడింది.
విస్తారమైన అగ్ని, చెక్కతో
దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది;
యెహోవా ఊపిరి
మండుతున్న గంధక ప్రవాహంలా
దానిని రగిలిస్తుంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెషయా 30: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.